అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవడంపై నోటిఫికేషన్ జారీ

అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవడంపై నోటిఫికేషన్ జారీ
  •  
  • హనుమకొండ జిల్లా వంగరలో 182.36 ఎకరాల అసైన్డ్​ భూముల సేకరణకు నోటిఫికేషన్
  •    అక్కడ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నం
  •     భూమి పోయినా ఏ ఒక్కరూ నిర్వాసితులు కావడం లేదు
  •     పునరావాస ప్యాకేజీ వర్తించదని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న సర్కారు

హైదరాబాద్, వెలుగు: ఎంత వ్యతిరేకత వస్తున్నా సరే.. అసైన్డ్ భూముల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. గత ప్రభుత్వాలు దళితులు, గిరిజనులు, బీసీలకు ఇచ్చిన భూములను కేసీఆర్ సర్కార్ తిరిగి తీసుకుంటోంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌‌ను తీసుకొచ్చి.. స్వయంగా తన మిగులు భూములను పేదలకు పంచారు. ఈ భూములను వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రయోజనాల కోసం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని భూమి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అందులో పేర్కొంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారో నిర్ణయించలేదని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపాధిపై సర్కార్ నుంచి ఎలాంటి హామీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు భూములిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.

రైతుల ఆందోళన

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు కోసం వంగర గ్రామంలోని ఐదు సర్వే నంబర్లలో మొత్తం 182.36 ఎకరాల భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. 575 సర్వే నంబర్‌‌‌‌లోని 36.18 ఎకరాలు, 576 సర్వే నంబర్‌‌‌‌లో 29.27 ఎకరాలు, 579 సర్వే నంబర్‌‌‌‌లో 48.21 ఎకరాలు, 583/1లోని 41.32 ఎకరాలు, 595 సర్వే నంబర్‌‌‌‌లోని 26.18 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోబోతున్నారు. ప్రభుత్వం తీసుకునేదంతా మెయిన్ రోడ్డు వెంట ఉన్న సీలింగ్ పట్టా భూమి. గత అక్టోబర్‌‌‌‌లో రెవెన్యూ అధికారులు సర్వేకు వచ్చినప్పుడే రైతులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో 120 కుటుంబాలు సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్టు భూసేకరణ ద్వారా ఏ ఒక్క కుటుంబం భూనిర్వాసితులు కావడం లేదని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. ‘పునరుపాధి, పునరావాస ప్యాకేజీ ఈ ప్రాజెక్టుకు వర్తించదు’ అని అందులో ఉండటంతో.. పరిహారం, ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపాధిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 

మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధర ఇవ్వాలి

భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఏండ్ల తరబడి ఈ భూమిని నమ్ముకొని, బావులు, బోర్లతో పంటలు పండించుకుని బతుకుతున్నరు. భూమి పోతే మాకు వేరే ఉపాధి లేదు. సీలింగ్ భూమి కాబట్టి బలవంతంగానైనా ప్రభుత్వానికి తీసుకునే అధికారం ఉందని ఆఫీసర్లు చెప్తున్నరు. అలాగైతే మార్కెట్ ధర కంటే రెట్టింపు ధరను నష్టపరిహారంగా అందించాలి. లేదంటే మా భూములు ఇవ్వం.
- గజ్జెల రమేశ్‌‌, వంగర

ఉపాధి కల్పించాలి

భూములు కోల్పోతున్న రైతు కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఉపాధి కల్పించాలి. న్యాయమైన పరిహారం ఇవ్వాలి. వీటిపై సర్కార్ హామీ ఇచ్చిన తర్వాతే మా భూములు ఇస్తం.
- కండె రమేశ్, వంగర