నా చివరి రక్తపుబొట్టు దాకా పోరాడ్త

నా చివరి రక్తపుబొట్టు దాకా పోరాడ్త
  • ఏడేండ్లలో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం
  • దళిత బంధుకు ఏటా 30 వేల కోట్లు.. దశలవారీగా అమలు చేస్తం
  • ఈ స్కీం మహా ఉద్యమంగా మారుతది.. దేశానికే పాఠం నేర్పుతది
  • త్వరలో హైదరాబాద్​లో విస్తృత స్థాయి సమావేశం ఉంటది
  • కాంట్రాక్ట్​ రంగంలోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి
  • దళిత బంధు స్కీంపై కరీంనగర్​ కలెక్టరేట్​లో రివ్యూ

కరీంనగర్, వెలుగు:  ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే  దళిత బంధు విజయవంతం కావడానికి కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నటి నుంచి ఎవరు పెట్టిన్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమన్నారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, దళితుల సమగ్రాభివృద్ధికి కూడా అంతే పట్టుదలతో పోరాడుతామని చెప్పారు. దళిత బంధు స్కీంపై శుక్రవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు కరీంనగర్ కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో  సీఎం కేసీఆర్​ రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. రాష్ట్రం ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం” అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తోందన్నారు. 
ఆదరబాదర అవసరం లేదు
దళితబంధు ఆలోచన ఇప్పటిది కాదని, తాను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం తెలిపారు. 
రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేద్దాం
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని తేలింది. దాదాపు 75 లక్షల దళిత జనాభా రాష్ట్రంలో ఉంది. అంటే.. రాష్ట్ర జనాభాలో 18 శాతం దళితులు ఉన్నారు. వారి జనాభా పెరుగుతున్నది. దానికి తగ్గట్లు రాబోయే రోజుల్లో వారి రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం.                                                                                                                                                                                 ‑ సీఎం కేసీఆర్
దేశానికే వెలుగులు పంచుతుంది
రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఉద్యోగులు, వాళ్లు, వీళ్లు అనే తేడాలేకుండా ఎట్లయితే అందిస్తున్నామో, అదే పద్ధతిలో దళిత బంధును కూడా చేపడుతున్నామని సీఎం చెప్పారు. దళిత బస్తీలోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు కూడా దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ. లక్షా 75 వేల కోట్లు  ఖర్చు చేసి యావత్​ తెలంగాణ దళిత కుటుంబాలను దశల వారీగా రాబోయే కాలంలో అభివృద్ధి చేసుకుందామన్నారు. ‘‘ఏటా రూ. 20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లు ఖర్చు చేస్తూ.. 2 లక్షల నుంచి 3 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు కార్యక్రమాన్ని దశలవారీగా అమలుపరుస్తాం” అని సీఎం తెలిపారు. హుజూరాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచుతుందని చెప్పారు. 


‘‘నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన” అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉందని, ఉత్తర భారతదేశంలో దళితుల పరిస్థితిని చూస్తే, మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు చలించిపోక తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదామని సూచించారు. ఇది చిల్లర మల్లర ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని, ఆదరబాదర అవసరం లేదన్నారు. ప్రతి దళిత కుటుంబాన్ని అభివృద్ధి చేసే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని అన్ని దళిత కుటుంబాలకు చేర్చేందుకు దళిత మేధావి వర్గం నడుం బిగించాలని సూచించారు. త్వరలో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో దళిత బంధు మహా ఉద్యమంగా మారబోతుందని, హుజూరాబాద్ నియోజకవర్గం యావత్ తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్  కాబోతుందని అన్నారు. 
పరిశ్రమల్లో 15 లక్షల ఉద్యోగాలొచ్చినయ్​
తెలంగాణ పరిశ్రమల రంగంలో ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయని సీఎం తెలిపారు. అదే పద్ధతిలో రూ. 1.75 లక్షల కోట్ల ను  దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దళిత బంధు  పథకం అందిస్తుందన్నారు. గ్రామ , మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర  స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ‘‘ఆఫీసర్లు మొదట ప్రతి దళిత కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి. చేపట్టిన పనిని సమర్థంగా నిర్వహించగలిగే పరిస్థితి లబ్ధిదారునికి ఉందా, లేదా అంచనా వేయాలి. వారికి తెలువకపోతే అర్థం చేయించాలి. లబ్ధిదారులకు దళిత బంధు పథకం ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేకంగా ‘తెలంగాణ దళిత బంధు బ్యాంకు ఖాతా’ ను తెరిపించాలి. దళిత బంధు అకౌంట్ ను ట్యాగ్ చేసుకొని లబ్ధిదారు కుటుంబం చేపట్టిన పని పురోగతిని ఆన్ లైన్​లో పర్యవేక్షిస్తూ తగిన సూచనలు అందించాలి. దళిత కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు జనం భాషలోనే వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి” అని సూచించారు. పాల ఉత్పత్తికి  కరీంనగర్ జిల్లాలో అనుకూల వాతావరణం ఉందని, దళిత బంధు పథకంలో  ఔత్సాహికుల కోసం డెయిరీ ఫామ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, కరీంనగర్ డెయిరీవాళ్లతో  మాట్లాడి పాల సేకరణలో సాయం  తీసుకోవాలన్నారు. సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు, మెధావులు, సీనియర్ రాజకీయ నేతలతో సీఎం చర్చించారు. రివ్యూ అనంతరం సీఎం రిసోర్స్ పర్సన్లతో కలిసి భోజనం చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్,  కొప్పుల ఈశ్వర్  పాల్గొన్నారు.
దళిత బంధుతో నచ్చిన పని చేసుకోవచ్చు
‘‘దళిత బంధు లబ్ధిదారులు ఫలానా పని మాత్రమే చేయాలని లేదు. ఫలానా చోటే చేయాలని లేదు.  నచ్చిన పని, చేయవచ్చిన పని చేసుకోవచ్చు. సేమ్​టైం అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత లబ్ధి పొందవచ్చు” అని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, హాస్టల్స్, హాస్పిటల్స్ కు విద్యుత్ రంగ సంస్థలకు మెటీరియల్ సప్లయ్ చేసే అంశంలో, సివిల్ సప్లయ్స్ రంగంలో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు. కాంట్రాక్ట్​ రంగంలో కూడా కొంత శాతం రిజర్వేషన్ కోసం ఆలోచన చేస్తామని చెప్పారు.