Dasara 2025: శివుడు.. పార్వతి దేవికి చెప్పిన రహస్యం ఇదే..!

Dasara 2025: శివుడు.. పార్వతి దేవికి చెప్పిన రహస్యం ఇదే..!

 దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు    విజయదశమికి చాలా  ప్రత్యేకత ఉంది. అదేమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా అంటే రాహు కాలంతో కానీ, దుర్ముహుర్తంతో కానీ, పంచాంగంతో కానీ సంబంధం లేకుండా విజయదశమి రోజున ( 2025 అక్టోబర్​ 2) ముహూర్తం లేకుండా  ఏ పని చేసినా సంవత్సరం మొత్తం అద్భుతం ఫలితాలు కలుగుతాయని, దాన్ని విజయ ముహూర్తం అనే పేరుతో పిలుస్తారని పరమ శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో చెప్పారు

దేవదానవులు పాల సముద్రమును మధించి నప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రవణా నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి విజయ దశమి అను పేరు వచ్చినది. ఈరోజున ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము చూడకుండా...   విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యమని పండితులు చెబుతున్నారు. 

 

చతుర్వర్గ చింతామణి  అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి రోజునే విజయ ఢంకా మోగించింది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము. శ్రీ రాముడు  విజయదశమి రోజున  అపరాజితా దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు.  శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి , నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా , ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని , శ్రీరామునికి విజయాన్ని కలుగజేసింది.  

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం..  శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి  జమ్మి చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని  పండితులు చెబుతున్నారు.

శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనీ 
 అర్జునస్య ధనుర్ధారీ ...రామస్య ప్రియదర్శిని 

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనస్సును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులకు  జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి ఇచ్చి  , వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. 

బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. జమ్మికొమ్మలకు ఉన్న ఆకులను బంగారు , వెండిగా భావించి  పంచుతూ , శుభాకాంక్షలను తెలుపు కుంటారు. దీనినే ‘సోనా దేనా'  కార్యక్రమం అంటారు.   జమ్మి  ఆకులను పరస్పరం పంచుకొని , ఆలింగనం చేసుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి , కుల , మత , లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని , హృదయాల్ని కలిపే సామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.