మెస్ చార్జీలు తగ్గించమంటే హాస్టల్ నుంచి బహిష్కరించారు

మెస్ చార్జీలు తగ్గించమంటే హాస్టల్ నుంచి బహిష్కరించారు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో దారుణం 

హైదరాబాద్, వెలుగు :
పెంచిన మెస్ చార్జీలు తగ్గించాలని ఆందోళన చేసిన స్టూడెంట్లను హాస్టల్​నుంచి బహిష్కరించారు. ఈ  ఘటన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) లో జరిగింది. ఏకంగా 16 మంది విద్యార్థులపై వర్సిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. దీంట్లో మనూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులూ ఉండడం గమనార్హం. జూన్​లో ఉర్దూ వర్సిటీ అధికారులు మెస్ చార్జీలు పెంచారు. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆ నెల 6, 7 తేదీల్లో వర్సిటీలో ఆందోళన చేశారు. మెయిన్ గేట్ మూసేసి, స్టాఫ్​ను అడ్డుకున్నారు. మెస్ చార్జీల పెంపుపై  కమిటీ వేస్తామని ప్రకటించడంతో స్టూడెంట్లు ఆందోళన విరమించారు. ఆందోళనలను సీరియస్​గా తీసుకున్న వర్సిటీ అధికారులు.. కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసింది. ఆందోళనకు నాయకత్వం వహించిన స్టూడెంట్ యూనియన్ నేతలతో పాటు ఇతర విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. దీంతో 16 మంది విద్యార్థులను కోర్సు పూర్తయ్యేదాక హాస్టల్ నుంచి బహిష్కరిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. జరిమానా కూడా విధించారు.

మూడేండ్ల పాటు వారికి వర్సిటీలో ఎలాంటి కోర్సులో అడ్మిషన్ ఇవ్వబోమని ప్రకటించారు. బహిష్కరణకు గురైన వారిలో మనూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ముర్సలిన్, మహ్మద్ హారిస్, ఉపాధ్యక్షుడు అబూ హంజా, ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. అయితే సెమిస్టర్ హాలిడేస్​ పేరుతో విద్యార్థులందరినీ హాస్టల్స్​ ఖాళీ చేయించి, ఇలా చర్యలు తీసుకోవడంపై విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వీసీ కక్షసాధింపుతో ఈ చర్యలు తీసుకున్నారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. బహిష్కరణలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ) మనూ యూనిట్ ప్రకటించింది. 

ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలె
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే హాస్టల్స్ నుంచి బహిష్కరించడం సరికాదని, వెంటనే బహిష్కరణ ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అబుహంజా డిమాండ్ చేస్తూ మనూ వీసీకి లేఖ రాశారు.