ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పిటిషన్.. రాజ్యాంగ ధర్మాసనానికి అటాచ్

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పిటిషన్.. రాజ్యాంగ ధర్మాసనానికి అటాచ్

న్యూఢిల్లీ, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసుకు అటాచ్ చేసింది. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావడంతో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న దవిందర్ కేసుకు జత చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలంటూ ఎమ్మార్పీఎస్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను మంగళవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఎమ్మార్పీఎస్ తరఫు మహిళా న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రిజర్వేషన్ల అమలులో ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని బెంచ్ దృష్టికి తెచ్చారు. 50 శాతానికి పైగా జనాభా ఉన్న మాదిగ సామాజికవర్గం అత్యంత వెనుకబడి ఉందన్నారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ, జస్టిస్ రామచంద్రన్ కమిటీ, జస్టిస్ లోకూర్ కమిటీలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని నివేదించారు.

న్యాయబద్ధంగా మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న సీజేఐ.. రిజర్వేషన్ల వర్గీకరణపై పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసు ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగం ధర్మాసనం ముందున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశం కూడా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉన్నందున దవిందర్ కేసుతో అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.