మే 11న శిండే, ఉద్ధవ్ వర్గాల పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు

మే 11న శిండే, ఉద్ధవ్ వర్గాల పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీ : శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం (మే 11న) సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిండే కొనసాగుతారా..? లేక మరోసారి ఉద్ధవ్‌కు సీఎం పగ్గాలు వెళ్తాయా..? శిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితేంటి..? అన్న ఈ ప్రశ్నలన్నింటికీ సుప్రీంకోర్టు తీర్పుతో సమాధానం రానుంది. 9 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మార్చి 16న తన తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. 

2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిండేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ శిండే బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ శిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

తిరుగుబాటు నేత, ఆయన వర్గ ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియ ఉపసభాపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే శిండేతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన అప్పటి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ నిర్ణయాన్ని కూడా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ప్రశ్నించింది. మరోవైపు.. ఫిరాయింపు ఆరోపణలతో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ శిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం (మే 11న) తీర్పులను వెలువరించనుంది.