- పైలట్ ప్రాజెక్టు కింద 25 వేల కుటుంబాలు ఎంపిక
- సర్వే కోసం 96 టీమ్స్
- ఒక్కో టీమ్లో నలుగురు
- ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్న సర్వే
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లో డిజిటల్ కార్డుల సర్వేను పైలట్ ప్రాజెక్ట్ కింద శుక్రవారం నుంచి మొదలుపెట్టనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లోని 25 వేల కుటుంబాల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఒక్కో టీమ్లో నలుగురిని నియమించిన బల్దియా మొత్తం 96 టీమ్స్ ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఒక కాలనీని ఎంపిక చేసి ఒక్కో టీమ్ రోజూ కనీసం 40 ఇండ్లు సర్వే చేసేలా బాధ్యతలు అప్పజెప్పింది. వీరందరినీ పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్– కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వహాబ్ నగర్, కార్ఖానా ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇక్కడున్న సుమారు 1500 కుటుంబాలను సర్వే చేయనున్నారు.
బల్దియా డేటా ఆధారంగా సర్వే
సర్వే చేయడానికి ఇప్పటికే ఆయా టీమ్స్కు ట్యాబ్స్ అందజేశారు. ఇంటింటికీ వెళ్లిన టైంలో తమ దగ్గరున్న డేటా ఆధారంగా, కుటుంబసభ్యుల ఆధార్ కార్డు వివరాలతో పోల్చి వివరాలు సరిగ్గా ఉన్నాయా?లేదా? అన్నది తెలుసుకుంటారు. టీమ్స్ వద్ద ఉన్న వివరాల కంటే ఆ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే వారి వివరాలు కూడా యాడ్ చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే వారి వివరాలను తొలగిస్తారు. ఆ కుటుంబంతోనే ఉంటూ వారి వివరాలు టీమ్స్ వద్ద లేకపోతే వారి ఆధార్ కార్డులను సేకరించి వారి వివరాలను ఎంట్రీ చేస్తారు.
ఇంటి పెద్ద మహిళే..
ప్రతి కుటుంబంలో ఇంటి పెద్దగా సీనియర్ మహిళను తీసుకోనున్నారు. ఒక కుటుంబం ఒక చోట మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, చనిపోయిన వారి వివరాలు, కొత్త ఫ్యామిలీ, మైగ్రేషన్, పర్మినెంట్గా విదేశాలకువెళ్లిన వారి వివరాలు తీసుకుంటారు. ఈ నెల 8వ వరకు సర్వే చేసి 9న స్క్రూటినీ తర్వాత 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాత డిజిటల్ కార్డులు జారీ చేస్తారు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా గుర్తించి ఐడీ కార్డు ఇస్తారు.
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ట్రైనింగ్ పూర్తి
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి సిబ్బందికి గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్శిక్షణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు, ఏఎంసీలు, డీపీఓలు, సీఓలకు డిజిటల్ కార్డుల కోసం సేకరించాల్సిన వివరాలు, ఫార్మేట్స్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఐదు రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని స్నేహ శబరీశ్ ఆదేశించారు.