ఇండియానా యూనివర్సిటీలో విషాదం..ఇద్దరు మృతి

ఇండియానా యూనివర్సిటీలో విషాదం..ఇద్దరు మృతి

న్యూయార్క్: అమెరికాలో మన ఇండియన్  స్టూడెంట్ల ఈత సరదా విషాదంగా మారింది. ఇండియానా స్టేట్ లోని ఓ సరస్సులో గల్లంతయిన ఇద్దరు ఇండియన్  స్టూడెంట్లు మృతి చెందారు. వారి డెడ్ బాడీలను డైవర్లు వెలికి తీశారు. మృతులను సిద్ధార్థ్  షా(19), ఆర్యన్  వైద్య (20) గా గుర్తించారు. వారిద్దరూ తమ ఫ్రెండ్స్​తో కలిసి ఈ నెల 15న ఇండియానాపొలిస్​కు ఆగ్నేయంలో 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్రో సరస్సుకు వెళ్లారు. స్నేహితులతో కలిసి షా, వైద్య సరస్సులో బోటింగ్  చేస్తున్నారు. చెరువులో దిగి ఈత కొట్టాలని ఒక చోట బోట్ ను ఆపారు. షా, వైద్య సరస్సులో దూకారు. ఎంతసేపైనా వారు కనిపించకపోలేదు. ఆ ఇద్దరిలో ఒకరు సరస్సులో కొట్టుకుపోతూ కనిపించాడు. దీంతో మిగతా స్నేహితులు కూడా సరస్సులో దూకి అతడిని కాపాడేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. మరొకరి జాడ కూడా దొరకలేదు. దీంతో స్నేహితులు డిజాస్టర్  మేనేజ్ మెంట్ కు సమాచారం ఇచ్చారు. తర్వాతి రోజు ప్రతికూల వాతావరణం మధ్యలోనే సోనార్, స్కూబా డైవర్లు రోజంతా గాలించినా వైద్య, షా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు కూడా గాలింపు కొనసాగించారు. అయినా ఉపయోగంలేకుండా పోయింది. మూడో రోజు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గాలించి సరస్సులో 18 అడుగుల లోతులో షా, వైద్య మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. డెడ్ బాడీలను రికవరీ చేసి పోస్టుమార్టం కోసం తరలించామని 
అధికారులు తెలిపారు.

ఇండియానా యూనివర్సిటీలో విషాదం

సిద్ధార్థ్ షా, ఆర్యన్  వైద్య ఇండియానా వర్సిటీలోని కెల్లీ స్కూల్  ఆఫ్​  బిజినెస్​లో చదువుతున్నారు. వారి మృతి వార్త తెలిసి వర్సిటీలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. స్టూడెంట్లు, స్నేహితులు, ప్రొఫెసర్లు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా, ఆర్యన్  వైద్య 2021లో సైకమోర్  హైస్కూల్​లో గ్రాడ్యుయేట్ అయ్యాడు. అతని మృతి వార్త తెలిసి సైకమోర్ కమ్యూనిటీ షాకయింది.