వినూత్నంగా కాంగ్రెస్ ప్రచారం : గులాబీ కారుపై బై బై కేసిఆర్ పోస్టర్లు

వినూత్నంగా కాంగ్రెస్ ప్రచారం : గులాబీ కారుపై బై బై కేసిఆర్ పోస్టర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాలు మరింత ఊపందుకున్నాయి. పొలిటికల్ పార్టీల మధ్య డైలాగ్ వార్స్ పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అంతేకాదు.. సోషల్​ మీడియానూ బాగా ఉపయోగించుకుంటున్నారు. జనాల్లోకి వెళ్లేందుకు, ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం ఉధృతం చేసింది.

కేసీఆర్ తన హయాంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం(నవంబర్ 3వ తేదీన) గాంధీభవన్ లో 'బై బై కేసీఆర్' ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కారును అలంకరించి దానిపై 'బై-బై కేసీఆర్' అంటూ రాసి ఉంచారు.  

పదేండ్ల అహంకారంపై తిరగబడుదాం 
పదేండ్ల పంక్చర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం

అని కారు వెనుక  భాగంలో రాసి ఉంచారు. అంతేకాదు.. కేసీఆర్ తెలంగాణను ముంచిండు.. 5 లక్షల కోట్లు అప్పును మోపిండు అని రాసి ఉంచారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. అయితే తన కుటుంబానికి ఈ మూడు హామీలను నెరవేర్చారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ అజోయ్ కుమార్ అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని, పేదలు మాత్రం ఎప్పటిలానే ఉన్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 90 ఎంఎల్ ప్రభుత్వం అని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు.

కేటీఆర్ కూడా కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మానసిక ఆస్పత్రిలో కేటీఆర్ ను చేర్పిస్తానని, ఆయన తనకు అన్నయ్య లాంటి వారని చెప్పారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో పాటు వీలైతే 90 ఎంఎల్​ మద్యంతో సహా అన్ని ఏర్పాట్లు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

2014, 2018లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ నేత కిరణ్​కుమార్ చామల. బీఆర్ఎస్ గులాబీ కారు 2001 నాటిదని, ఇప్పుడు ఆ కారు స్క్రాపింగ్ కోసం వెళ్లాల్సి ఉందన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపాధి లభించిందన్నారు. దళితుల కుటుంబాల్లో ఎవరికీ మూడెకరాల భూమి లేదని, కేసీఆర్ కు మాత్రం గజ్వేల్ లో 150 ఎకరాల ఫామ్ హౌస్ ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కారును ఫొటోలు తీసి షేర్ చేస్తున్నారు.