
- యూజీ కేబుల్స్ ఏర్పాట్లపై దృష్టిపెట్టిన సర్కార్
- ఈదురుగాలులు, వర్షాలతో నగరంలో చీటికీ మాటికీ పవర్ కట్లు
- అండర్ గ్రౌండ్ కేబుల్స్ తోనే సమస్యకు పరిష్కారం
- ఒక్కో కిలోమీటర్‌కు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు
- ముందుగా ఓఆర్ఆర్ పరిధిలో పూర్తిస్థాయిలో ఏర్పాటుకు నిర్ణయం
- అంతర్జాతీయ విధానాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో ఈదురుగాలులు, వర్షాలతో చీటికి మాటికి కరెంట్ కట్ అవుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ తో చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్స్ ద్వారా కరెంట్ అంతరాయాలను తగ్గించడమే కాక, విద్యుత్ నష్టాలు, చౌర్యాన్ని అరికట్టడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా విద్యుత్ వ్యవస్థను కాపాడాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ వ్యవస్థ ఏర్పాటుకు కిలోమీటరుకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 1,280 కిలోమీటర్ల మేర 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉండగా, దీన్ని మరింత విస్తరించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
అంతర్జాతీయ విధానాలపై అధ్యయనం
అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసిన విదేశీ నగరాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహణను అనుభవం కలిగిన సంస్థలకు అప్పగించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా హైదరాబాద్‌ను విద్యుత్ సమస్యలు లేని, అధునాతన నగరంగా మార్చేందుకు సర్కారు కృషి చేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలకమవుతుందని అధికారులు భావిస్తున్నారు. వేసవిలో ఓవర్‌లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, రిపేర్లకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడంతో విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థతో ఈ సమస్యలు తప్పనున్నాయి. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్ల అప్‌గ్రెడేషన్, లైన్ల ఆధునీకరణపై కూడా సదరన్ డిస్కం దృష్టి సారించింది.
డిమాండ్ కు తగ్గట్టు ఏర్పాట్లు..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగి 17,162 మెగావాట్లకు చేరింది. 2025–-26 నాటికి ఇది 18,138 మెగావాట్లకు, 2034-–35 నాటికి 31,808 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలు, రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోని రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లకు అవసరమైన విద్యుత్ సరఫరాను సమర్థంగా అందించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది.
ఫ్యూచర్ సిటీలో పూర్తిగా యూజీ కరెంట్
కొత్తగా నిర్మించే ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్ వంటివి లేకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సిటీలోని సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి కీలక ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు, ఓఆర్ఆర్ వెంబడి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు.