విక్టోరియా హోం గ్రౌండ్​లో ఫ్రూట్ మార్కెట్​?

విక్టోరియా హోం గ్రౌండ్​లో ఫ్రూట్ మార్కెట్​?

హైదరాబాద్‌‌, వెలుగు: విక్టోరియా మెమోరియల్‌‌ హోంపై మరోసారి ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ముసుగులో హైదరాబాద్​ సరూర్‌‌నగర్‌‌ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఈ స్థలాన్ని రాచకొండ కమిషనరేట్‌‌కు కేటాయిస్తూ సర్కారు విడుదల చేసిన జీవోను గతంలోనే హైకోర్టు కొట్టేసింది. అయితే, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌‌ను నగర శివారుకు తరలించాలని, అందుకు గతంలోనే కోహెడలో 175 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో ఆస్పత్రి కట్టాలని సర్కారు నిర్ణయించింది. అప్పటిదాకా తాత్కాలికంగా మార్కెట్​ను బాటసింగారానికి తరలించాలని భావించింది. ఈ నిర్ణయంపై ఫ్రూట్ కమీషన్ ఏజెంట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. హైకోర్టులో పిటిషన్లూ దాఖలయ్యాయి. దీంతో పాటు మార్కెట్​ను తరలించాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచన చేయాలని శాసనసభలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఫ్రూట్ మార్కెట్​ను టెంపరరీగా బాటసింగారానికి తరలించే బదులు కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్​లో ఏర్పాటుకు పరిశీలించాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్​లోని ఆయన నివాసంలో వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సోమవారం మెమోరియల్ హోం జాగను పరిశీలించాలని నిర్ణయించారు. 

అనాథలు ఆగం..

అనాథల సంక్షేమానికి నిజాం తన ప్యాలెస్‌‌ను, 80 ఎకాల స్థలాన్ని కేటాయించారు. విక్టోరియా రాణి పేరిట విక్టోరియా హోంగా మార్చి ట్రస్టుగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్దీ ఈ స్థలం విలువ పెరుగుతూ వస్తోంది. మొదట విద్యాశాఖ కింద ఉండగా, తర్వాత ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనికి నిజాంకాలం నుంచి ప్రభుత్వం తరఫున స్పెషల్‌‌ గ్రాంట్‌‌ అందుతోంది. ఈ హోంలో వందేండ్ల నుంచి అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి మందికి పైగా చదువుకుంటున్నారు. వీరంతా అనాథలు కావడంతో స్టూడెంట్స్‌‌ రెసిడెన్షియల్‌‌ పద్ధతిలో చదుకుంటున్నారు. దీన్ని పండ్ల మార్కెట్‌‌కు అప్పగించడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి.