రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్లకు కొత్త బాధ్యతలు..

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్లకు కొత్త బాధ్యతలు..
  • ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు,వాటర్ బిల్లులన్నీ చెల్లిస్తేనే
  • రిజిస్ట్రేషన్లు ఖమ్మం కార్పొరేషన్‌ నుంచి 10 గ్రామాల మినహాయింపు
  • మున్సి పల్‌ చట్టానికి సవరణలు

హైదరాబాద్‌, వెలుగుగ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇండ్లు, ప్లాట్ల మ్యుటేషన్‌ అధికారాలను సబ్​ రిజిస్ట్రార్​కు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు మున్సిపల్​ కమిషనర్లకు ఉన్న ఈ పవర్స్​ను బదలాయిస్తూ మున్సిపల్​ చట్టంలో సవరణలను ప్రతిపాదించారు. మ్యుటేషన్ల ప్రక్రియను ఆన్​లైన్​లోనే పూర్తి చేయనున్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ చట్టాల సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే మ్యూటేషన్‌ ప్రక్రియ జరుగుతుందని, ప్రజలకు సులువుగా సేవలందుతాయని వివరించారు. ఈ బిల్లుకు అసెంబ్లీ, మండలి ఆమోదం తెలిపి,
గెజిట్‌ పబ్లిష్‌ కాగానే కొత్త విధానం అమల్లోకి రానుంది.

బిల్లులన్నీ కడితేనే ట్రాన్స్​ఫర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ తోపాటు రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో భూములు, ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేవారు.. ఇకపై భూయాజమాన్య హక్కు కోసం మున్సిపల్‌ కమిషనర్‌కు వేరుగా అప్లికేషన్​ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సంబంధిత స్థలం, ఇంటిని మరొకరి పేరిట ట్రాన్స్‌ఫర్‌ చేసేప్పుడు.. దాని ప్రాపర్టీ ట్యాక్స్‌, కరెంట్‌, వాటర్‌ చార్జీలు పూర్తిగా కట్టేసి, రశీదులు జత చేయాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు మ్యుటేషన్‌ ఫీజు చెల్లిస్తే చాలు. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అర్బన్‌ ఏరియా ఆస్తుల మ్యూటేషన్‌ చేస్తారు. దాంతోపాటే సంబంధిత ఆస్తి, ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (పీఐటీఎన్‌)ను సబ్‌ రిజిస్ట్రారే కేటాయిస్తారు.

ఖమ్మం కార్పొరేషన్‌ నుంచి 10 గ్రామాలు తొలగింపు

ఖమ్మం కార్పొరేషన్‌ నుంచి పెద్దతండా, పోలిపల్లి (రాజీవ్‌ గృహకల్ప, సాయినగర్‌ కాలనీ, భద్రాద్రి కాలనీ, ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, పీహెచ్‌సీ కాలనీ), ఈదులపురం, చిన్న వెంకటగిరి, గుర్రాలపాడు, గుడిమల్ల గ్రామాలను తిరిగి వేరు చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ నుంచి మున్నేరు నది ఈ గ్రామాలను వేరు చేస్తుందని.. అక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి వాటిని కార్పొరేషన్‌ నుంచి తొలగిస్తున్నామని బిల్లులో తెలిపారు.

కొత్తగా కొత్తూరు మున్సిపాలిటీ

రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, తిమ్మాపూర్‌ గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్తూరు మున్సిపాలిటీని ఏర్పాటు చేయనున్నారు. 12 వార్డులతో ఈ మున్సిపాలిటీ ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలోని మున్సిపాలిటీల సంఖ్య 129కి పెరగనుంది. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల తరహాలోనే కొత్తూరులోనూ మ్యుటేషన్‌ అధికారాలను సబ్‌ రిజిస్ట్రార్‌కు బదిలీ చేస్తారు. మెదక్‌ జిల్లాలోని తెల్లాపూర్‌ మున్సిపాలిటీకి సమీపంలోని మాన్‌మోలి గ్రామంలో 475 నుంచి 482 వరకుఉన్న సర్వే నంబర్ల భూమిని తెల్లపూర్‌ మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ భూమి జీహెచ్‌ఎంసీలోని రామచంద్రాపురం డివిజన్‌లో ఉంది.