కౌలు రైతులు ఏకమైతన్రు..!

కౌలు రైతులు ఏకమైతన్రు..!

సూర్యాపేట​, వెలుగు: కిందటి యాసంగిలో సర్కారు వరి వద్దనడంతో సాగుకు దూరమైన కౌలు రైతులు ప్రస్తుతం జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్నారు. అటు ఆసాములు కౌలు రేట్లు పెంచడం, రెండు మూడేళ్లుగా పంట దిగుబడులు తగ్గిపోవడం, సర్కారు నుంచి రైతుబంధులాంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో ఇప్పటికే  అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎటుచూసినా ఆదుకునే దిక్కు లేకపోవడం, వ్యవసాయం తప్ప మరో పని తెలియకపోవడంతో తమ బతుకులను తామే బాగు చేసుకునేందుకు ఏకమవుతున్నారు. గ్రామగ్రామానా కౌలు రైతు సంఘాలు ఏర్పాటుచేసుకొని  పంట కౌలును వారే నిర్ణయించుకొని తీర్మానాలు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొదలైన ఈ కౌలు రైతుల ఉద్యమం క్రమంగా రాష్ట్రమంతా పాకుతోంది.
 

నాలుగోవంతు కౌలు రైతులే.. 
రాష్ట్రంలో సుమారు 61 లక్షల మంది రైతులు ఉండగా, వీరిలో నాలుగోవంతు అంటే  సుమారు 15 లక్షల దాకా కౌలు రైతులే ఉన్నారు. ఎలాంటి సొంత భూమి లేక కౌలుకు తీసుకునేవారు కొందరైతే, కొద్దోగొప్పో భూమి ఉండి, ఇంకొంత భూమిని కౌలుకు తీసుకునేవారు మరికొందరు. స్టేట్​ వైడ్​చూసినప్పుడు కౌలురైతులు యాసంగిలో 30 లక్షల ఎకరాల్లో, వానకాలం 45 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని  అంచనా. వీరిలో ఎక్కువమంది వరి, పత్తి లాంటి ప్రధాన పంటలే వేస్తుంటారు. ఇందుకోసం ఏ సీజన్​కు  ఆ సీజన్ ఆసాములతో కౌలు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద నీటి వసతి ఉన్న  వరి పండే పొలాలకు ఎకరానికి రూ.16 నుంచి రూ.18వేల దాక, పత్తి పండే నల్లరేగడి నేలలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు కౌలు నడుస్తోంది. టీఆర్​ఎస్​ సర్కారు రైతుబంధు అమలు చేయకముందు రాష్ట్రంలో వ్యవసాయ భూముల  కౌలు రేట్లు రూ.6 వేల నుంచి 8 వేల వరకు ఉండేవి. రైతుబంధు అమలయ్యాక వ్యవసాయ భూముల రేట్లు ఎకరానికి సగటున రూ. 10 నుంచి 20 లక్షల వరకు పెరిగాయి. దీంతో పాటే ఆసాములు కౌలురేట్లను కూడా పెంచేశారు. 
 

దిగుబడి అంచనాల ఆధారంగా కౌలు..
గ్రామాల్లో దిగుబడి అంచనాల ఆధారంగా కౌలు చెల్లించాలని రైతులు తీర్మానం చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే మునగాల, పెన్ పహాడ్, ఆత్మకూర్(ఎస్), నడిగూడెం మండలాల్లో కౌలు రైతులు సంఘాలుగా ఏర్పడ్డారు. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎంత కౌలు చెల్లించాలో తీర్మానం చేస్తున్నారు. వరి పంటకు ఏడు నుంచి 10 బస్తాల వరకు కౌలు ఇవ్వాలని, బస్తాలు తీసుకోనివారికి అందుకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాలని  పలు గ్రామాల్లో రైతులు నిర్ణయించారు. ఇందులోనూ నీటి వసతి ఉన్న పొలాలకు ఒకలా.. లేని పొలాలకు ఒకలా కౌలు చెల్లించాలని తీర్మానించారు. నల్గొండ జిల్లాలోనూ కౌలు రైతుల సంఘాలు గ్రామగ్రామాన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న కౌలు రైతులు సమావేశమై తీర్మానంపై సంతకాలు చేస్తున్నారు. ఎవరైనా తీర్మానం అతిక్రమిస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని పేర్కొంటున్నారు. జరిమానాకు అంగీకరిస్తున్నట్లు కౌలు రైతులతో సంతకాలు తీసుకుంటున్నారు. రైతులకు దిగుబడులతో సంబంధం లేకుండా పంట పండినా, పండకున్నా తాము నిర్ణయించిన కౌలు భూ యజమానులకు ఇవ్వాలనే ఒప్పందం కూడా కౌలు రైతుల సమావేశంలో ఉండటం విశేషం. అదే సమయంలో కౌలు రైతులకు సైతం రైతుబంధు, రైతు బీమా, రుణ సౌకర్యం కల్పించాలని సర్కారును కోరుతున్నారు.