లార్డ్స్‎లో ఎవరికీ పట్టు చిక్కలే.. రసవత్తరంగా సాగుతోన్న మూడో టెస్ట్

లార్డ్స్‎లో ఎవరికీ పట్టు చిక్కలే.. రసవత్తరంగా సాగుతోన్న మూడో టెస్ట్

ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆటలో పైచేయి కోసం ఇరు జట్లూ పోటాపోటీగా తలపడుతున్నాయి. పేస్ లీడర్  జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లతో అదరగొట్టినా ఇంగ్లండ్‌‌‌‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్‌‌‌‌ చేసి పట్టు సాధించే అవకాశాన్ని ఇండియా కోల్పోయింది. ఆపై, బ్యాటింగ్‌‌‌‌లోనూ శుభారంభం దక్కించుకోలేకపోయిన గిల్‌‌‌‌సేన శుక్రవారం, రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 43 ఓవర్లలో 145/3 స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (53 బ్యాటింగ్‌‌‌‌) ఫిఫ్టీతో రాణించాడు. కరుణ్ నాయర్ (40) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 251/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 112.3 ఓవర్లలో 387 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 

జో రూట్ (104) సెంచరీ పూర్తి చేసుకోగా..  బ్రైడన్ కార్స్‌‌‌‌ (56), జేమీ స్మిత్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీశాడు. ఓ దశలో ఇంగ్లండ్‌‌‌‌ను 271/7తో ఇబ్బందుల్లోకి నెట్టిన బౌలర్లు తర్వాత పట్టు సడలించారు. ఆపై, ఇన్‌‌‌‌ఫామ్ బ్యాటర్లు కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ (16), యశస్వి జైస్వాల్ (13) ఫెయిలయ్యారు. ప్రస్తుతం రాహుల్‌‌‌‌తో పాటు రిషబ్ పంత్ (19 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉండగా.. ఇంగ్లండ్ స్కోరుకు ఇండియా ఇంకా 242 రన్స్‌‌‌‌ దూరంలో ఉంది. మూడో రోజు రాహుల్, పంత్ ఏమేరకు రాణిస్తారన్నది కీలకం కానుంది.

బుమ్రా దెబ్బ.. స్మిత్, కార్స్‌‌‌‌ పోరాటం

రెండో రోజు ఆట ప్రారంభంలోనే బుమ్రా విజృంభించాడు. తొలి గంటలోనే  ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (44),  జో రూట్, క్రిస్ వోక్స్ (0)ను ఔట్‌‌‌‌ చేసి ఇంగ్లండ్‌‌‌‌ను దెబ్బకొట్టాడు. తొలుత ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌  స్టోక్స్‌‌‌‌ను అద్భుతమైన బాల్‌‌‌‌తో క్లీన్‌‌‌‌ బౌల్డ్ చేసి ఇండియాకు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఆపై లార్డ్స్‌‌‌‌లో రికార్డు స్థాయిలో ఎనిమిదో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్న వెంటనే రూట్​ను  బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో రూట్‌‌‌‌ను బుమ్రా ఔట్‌‌‌‌ చేయడం ఇది 11వ సారి. 

ఆ తర్వాతి బాల్‌‌‌‌ను వోక్స్ ఎడ్జ్‌‌‌‌ రాబట్టాడు. దాంతో 271/7తో నిలిచిన ఇంగ్లిష్‌‌‌‌ టీమ్​ను 300లోపే ఆలౌటయ్యేలా కనిపించింది.  స్మిత్ 5 రన్స్ వద్ద ఉన్నప్పుడు సిరాజ్ బౌలింగ్‌‌‌‌లో ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను సెకండ్‌‌‌‌ స్లిప్‌‌‌‌లో కేఎల్ రాహుల్ డ్రాప్ చేయడం ఇండియాను దెబ్బతీసింది. ఈ చాన్స్‌‌‌‌ను తను సద్వినియోగం చేసుకున్నాడు. అదే సమయంలో ఇండియా అభ్యర్థన మేరకు అంపైర్లు రెండుసార్లు బాల్‌‌‌‌ను మార్చడం ఇంగ్లిష్‌‌‌‌ టీమ్ కలిసొచ్చింది. స్మిత్, కార్స్ ఇండియా పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 

 వేగంగా ఆడి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న స్మిత్‌‌‌‌ 353/7 టీమ్‌‌‌‌ను లంచ్‌‌‌‌కు తీసుకెళ్లాడు. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే స్మిత్‌‌‌‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 82 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఆ వెంటనే ఆర్చర్ (4)ను బౌల్డ్ చేసిన బుమ్రా ఐదో వికెట్‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ టైమ్‌‌‌‌లో దూకుడు ఆడి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కార్స్‌‌‌‌ను సిరాజ్‌‌‌‌ లాస్ట్ వికెట్‌‌‌‌గా బౌల్డ్‌‌‌‌ చేశాడు.   

ఆదుకున్న రాహుల్‌‌‌‌

ఇంగ్లండ్‌‌‌‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్‌‌‌‌ చేయలేకపోయిన ఇండియా బ్యాటింగ్‌‌‌‌లో తడబడింది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో శుభారంభం అందుకోలేకపోయింది.  ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌ ఈసారి ఫెయిలయ్యాడు. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టిన అతడిని రీఎంట్రీ పేసర్‌‌‌‌‌‌‌‌ ​ఆర్చర్ రెండో ఓవర్లోనే ఔట్ చేశాడు. తన ఫర్ఫెక్ట్ లెంగ్త్ వేసిన 143కి.మీ బాల్‌‌‌‌కు జైస్వాల్ స్లిప్‌‌‌‌లో బ్రూక్‌‌‌‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. అయితే, మరో ఓపెనర్ రాహుల్‌‌‌‌, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన కరుణ్ నాయర్‌‌‌‌‌‌‌‌ జాగ్రత్తగా ఆడుతూ 44/1తో జట్టును టీ బ్రేక్‌‌కు తీసుకెళ్లారు.

 చివరి సెషన్‌‌‌‌లోనూ కేఎల్‌‌‌‌ నింపాదిగా ఆడగా.. కరుణ్‌‌‌‌ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టాడు. అయితే, మంచి ఆరంభాన్ని తను మరోసారి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత స్టోక్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో స్లిప్‌‌‌‌లో రూట్ పట్టిన సింగిల్ హ్యాండ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌‌‌‌కు 61 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది.  కొద్దిసేపటికే జట్టుకు మరో షాక్ తగిలింది. 

సూపర్ ఫామ్‌‌‌‌లో ఉన్న కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్ గిల్‌‌‌‌  వోక్స్ బౌలింగ్‌‌‌‌లో  స్మిత్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా 107/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌లో రాహుల్‌‌‌‌కు పంత్ తోడయ్యాడు. గాయం కారణంగా కీపింగ్‌‌‌‌కు దూరంగా ఉన్న రిషబ్ ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశాడు. తన మార్కు షాట్లతో బౌండ్రీలు కొట్టి ఇన్నింగ్స్‌‌‌‌కు కాస్త ఊపు తెచ్చాడు. మరో ఎండ్‌‌‌‌లో రాహుల్ 97 బాల్స్‌‌‌‌లో 50 పూర్తి చేసుకొని రెండో రోజు ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 112.3 ఓవర్లలో 387 ఆలౌట్ (జో రూట్ 104, కార్స్ 56, స్మిత్ 51, బుమ్రా 5/74, నితీశ్‌‌‌‌  రెడ్డి 2/62, సిరాజ్ 2/85). 
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌:  43 ఓవర్లలో 145/3 (రాహుల్ 53 బ్యాటింగ్‌‌‌‌, కరుణ్ 40,  స్టోక్స్ 1/16)

15 టెస్టుల్లో బుమ్రా ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేయడం ఇది 15వ సారి. విదేశీ గడ్డపై అత్యధికంగా 13సార్లు ఐదు వికెట్ల హాల్స్ సాధించిన ఇండియా బౌలర్‌‌‌‌గా  కపిల్ దేవ్ (12సార్లు) రికార్డును బ్రేక్ చేశాడు.