టిమ్స్​ హాస్పిటల్ క్లోజ్!

టిమ్స్​ హాస్పిటల్ క్లోజ్!
  •    హాస్పిటల్​లోని బెడ్స్, ఇతర సామగ్రి నిమ్స్​కి తరలింపు
  •     ఉద్యోగం కోల్పోనున్న 70 మంది డాక్టర్లు, 400 మంది సిబ్బంది
  •     కరోనా టైంలో రిస్క్​ చేసి సేవలందించామంటూ ఆవేదన
  •     ఏడాదిగా ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిచ్చామంటున్న సర్కారు?

గచ్చిబౌలి, వెలుగు: కరోనా టైంలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్​సైన్స్) హాస్పిటల్​ను ఈ నెల31వ తేదీ తర్వాత మూసివేయనున్నారు. ఇప్పటికే టిమ్స్​లోని బెడ్స్, ఇతర సామగ్రిని నిమ్స్ హాస్పిటల్​కి తరలించడం స్టార్ట్​చేశారు. రెండేళ్ల కింద కరోనా వైరస్​పీక్​స్టేజ్​లో ఉన్నప్పుడు టిమ్స్​కోసం ఏడాది కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించుకుంది. గతేడాది ప్రతిఒక్కరి కాంట్రాక్ట్​ను రెన్యువల్​చేసింది. ఈ ఏడాది చేయలేదు. ఈ నెల 31తో కాంట్రాక్ట్​ముగియనుంది. రెన్యువల్​చేయాలని కోరుతూ  డాక్టర్లు, సిబ్బంది ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావును కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 70 మంది డాక్టర్లు, 250 మంది నర్సులు, 150 సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ల్యాబ్ టెక్నీషియన్లు ఉపాధి కోల్పోనున్నారు. 

మీడియాకి చెప్తే రిజర్వేషన్ ఇవ్వం!

టిమ్స్​లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది తమ కాంట్రాక్టును రెన్యువల్​చేయాలని మూడు రోజుల కింద మంత్రి హరీశ్​రావును కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా టిమ్స్ ఉద్యోగులందరికీ కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి అన్నట్లు తెలిసింది. ఈసారి కాంట్రాక్ట్​రెన్యువల్ చేయడం కుదరదని తేల్చి చెప్పినట్లు సమాచారం. కొత్త జాబ్స్​నోటిఫికేషన్​లో అప్లై చేసుకుంటే 21 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారని తెలిసింది. ఈ విషయాన్ని మీడియాకు చెప్తే రిజర్వేషన్ కూడా ఇవ్వమని హెచ్చరించినట్లు హాస్పిటల్​ఉద్యోగుల ద్వారా తెలిసింది. దీంతో డాక్టర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

3–4 కి.మీ.లు నడిచొచ్చి మరీ..

కరోనా టైంలో కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉండి, ట్రాన్స్ పోర్టేషన్ లేకున్నా మూడు, నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చి ఉద్యోగాలు చేశామని నర్సులు, ఇతర స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ సెంటీవ్స్, పీఆర్‌‌‌‌సీలు ఇస్తామని నమ్మించి అవి కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. రిస్క్ అని తెలిసి కూడా ఉద్యోగాలు చేశామని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ముగిసింది, వచ్చే నెల నుంచి రాకండని చెప్పడం అన్యాయమంటున్నారు. ప్రాణాలకు తెగించి సేవలందించినోళ్లని ప్రభుత్వం ఇలా బాధపెడుతుందని అనుకోలేదంటున్నారు. తమ ఉద్యోగాలు పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టుని రెన్యువల్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

వచ్చే నెల నుంచి ఓపీలు మాత్రమే

ఏప్రిల్ మొదటి వారం నుంచి టిమ్స్ హాస్పిటల్​కేవలం ఓపీ సేవలకే పరిమితం కానుంది. ఇప్పటివరకు కరోనా ట్రీట్​మెంట్​ అందించిన టిమ్స్ హాస్పిటల్​ను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​గా తీర్చిదిద్దేందుకు పనులు మొదలుపెట్టనున్నారు. దీంతో ఇన్​పేషెంట్ సేవలు నిలిపేసి ఫస్ట్, సెకండ్​ఫ్లోర్లలో ఓపీ సేవలు అందించనున్నారు.