రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు

సీఎం కేసీఆర్‌‌‌‌కు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ
16 ప్రాజెక్టులు పెండింగ్​.. 2,500 కి.మీ. పనులు ఆగినయ్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. టీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కార్​ భూ కేటాయింపులు చేయకపోవడం, సకాలంలో రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆలస్యం అవుతున్నాయి. గత కొన్నేండ్లుగా భూములు అలాట్ చేయకపోవడంతో శాంక్షన్, ఎగ్జిక్యూషన్ స్టేజ్‌‌లో ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినట్లు రైల్వే శాఖ పేర్కొంది. కేంద్ర అధికారుల నుంచి ఎన్నిసార్లు లెటర్లు రాసినా స్పందన లేకపోవడంతో.. తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేరుగా సీఎం కేసీఆర్‌‌‌‌కు లేఖ రాశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఇవ్వాలని, అప్పుడే చేపట్టిన ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. కొన్నింటికి రాష్ట్ర వాటా కింద నిధులు కూడా ఇవ్వాల్సి ఉన్నదని, వాటిని మంజూరు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం 16 ప్రాజెక్టులు చేపట్టినట్లు లెటర్‌‌‌‌లో కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో 9 కొత్త రైల్వే లైన్లు కాగా, మరో 7 లైన్లు డబ్లింగ్ పనులకు సంబంధించినవి ఉన్నాయి. మొత్తం రూ.31,300 కోట్ల నిధులతో 2,500 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రధానంగా 6 ప్రాజెక్టులు కేవలం భూ సేకరణ జరగకపోవడం వల్లే ఆగిపోయినట్లు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల్లో కొన్ని భూసేకరణ లేక ఆగిపోతే, మరికొన్ని రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిలిచినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 ప్రాజెక్టులకు రూ.4,423 కోట్లను కేంద్రం ఇస్తుందని, రాష్ట్రం తన వాటాగా రూ.491 కోట్లు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఆ నిధులను త్వరగా రిలీజ్ చేయాలన్నారు. ఇంకా ఎంఎంటీఎస్​కు సంబంధించిన బకాయిలు రూ.700 కోట్ల మేర జమ చేయాల్సి ఉందన్నారు. మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్ విషయంలోనూ రూ.100 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఏమీ పట్టని రాష్ట్ర సర్కార్​

రాష్ట్ర సర్కార్‌‌‌‌ భూములు సేకరించి ఇవ్వకపోవడం.. కొన్ని సార్లు ల్యాండ్ అప్పగించినా వాటిని రైల్వేకు మ్యుటేషన్ చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. మనోహరాబాద్‌‌-, కొత్తపల్లి రైల్వే లైన్​151 కిలో మీటర్లు కాగా, దీనికి ఇంకా వెయ్యి ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. అక్కన్నపేట– మెదక్‌‌ రైల్వే లైన్‌‌కు భూ సేకరణ చేయలేదు. రాష్ట్ర సర్కార్ కోరిక మేరకు ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌-2ను యాదాద్రి వరకు 33 కిలో మీటర్ల పొడిగించేందుకు రైల్వే బోర్డు అనుమతించింది. రాష్ట్ర వాటా నిధులు జమ చేయకపోవడంతో ప్రాజెక్ట్‌‌ ప్రారంభం కాలేదు. కాజీపేట– బలార్షా, కాజీపేట–విజయవాడలకు మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడం లేదు. సికింద్రాబాద్‌‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో రెండు భారీ శాటిలైట్‌‌ టెర్మినళ్లు నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నిస్తోంది. చర్లపల్లి స్టేషన్‌‌ వద్ద రైల్వేకు 50 ఎకరాల భూమి ఉంది. నాగులపల్లిలో స్టేషన్‌‌ మినహా సొంత భూమి లేదు. వివిధ కారణాలు చెప్పి రాష్ట్ర సర్కార్‌‌‌‌ భూమిని కేటాయించడం లేదు. అక్కడితో ఆ ప్రపోజల్  ఆగిపోయింది. అయితే, గత్యంతరం లేక చర్లపల్లి వద్ద అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో 2016లో కొత్త టెర్మినల్‌‌ నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది.