మేం భూములిస్తే.. టీఆర్ఎస్ లాక్కుంటుంది

మేం భూములిస్తే.. టీఆర్ఎస్ లాక్కుంటుంది

గజ్వేల్/కోహెడ/చేర్యాల, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదోళ్లకు భూములు పంచితే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు వారి నుంచి లాగేసుకుంటోందని కాంగ్రెస్​ లీడర్లు ఆరోపించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గం మంగోల్​ గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క, హుస్నాబాద్, అక్కన్నపేట మండలంలోని తోటపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మద్దూరు మండలంలోని సలాక్​పూర్, మర్మాముల, లద్దునూర్, ధర్మారం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. మంగోల్​లో సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, గజ్వేల్​మాజీ ఎమ్మెల్యే టీ.నర్సారెడ్డితో కలసి సీతక్క కాంగ్రెస్​పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఆయా పనుల పేర్లతో రాష్ట్ర సర్కారు పేదల భూములను లాక్కోవడం సరికాదన్నారు. కాంగ్రెస్​ హయాంలో పేదవాళ్లకు భూ పంపిణీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ కల్పించామని గుర్తు చేశారు. టీఆర్​ఎస్​ సర్కారు వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్​ తన ఫామ్ హౌజ్​ లో తప్ప తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్​ కుటుంబం మాత్రం దర్జాగా పదవులు అనుభవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్, ఎర్రవల్లి ఎంపీటీసీ ప్రణవి, గజ్వేల్ మండల బాధ్యుడు మల్లారెడ్డి, టౌన్ అధ్యక్షుడు మొన్నగారి రాజు, నక్క రాములు గౌడ్, కొడకండ్ల మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు యాదవ్, శివారెడ్డి పాల్గొన్నారు.


నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి
తోటపల్లి, చౌటపల్లి గ్రామాల్లో  పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాకే ప్రాజెక్టు ట్రయల్ రన్​ నిర్వహించాలని డిమాండ్​ చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర,రాష్ర్టా ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. వానాకాలం ప్రారంభమైనా ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదన్నారు. సీఎం కేసీఆర్​మాటల్లో తప్ప చేతల్లో లేరని మండిపడ్డారు. కార్యక్రమంలో లీడర్లు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కేడం లింగామూర్తి, శ్రీనివాస్​ పాల్గొన్నారు.

నిలువు దోపిడీ చేస్తోన్న సర్కారు  
మద్దూరు మండల పరిధిలోని గ్రామాల్లో కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ టీఆర్​ఎస్​ ప్రభుత్వం సామాన్యులను నిలువు దోపిడీ చేస్తోందని, దోచుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత సామాన్య ప్రజల శ్రేయస్సుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం భూ కబ్జాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ధైర్యం ఉంటే కబ్జాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్​ విసిరితే ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించడం లేదన్నారు. టీఆర్​ఎస్​ సర్కారు తెలంగాణ ఉద్యమ కారులను పక్కన పెట్టి రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారికి పదవులు కట్టబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ​పార్టీ రైతుల శ్రేయస్సే ఎజెండాగా ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు జీవన్​రెడ్డి, రాజేశ్వర్​రెడ్డి, రమణారెడ్డి, శౌకత్​ అలీ, శ్రీనివాస్​రెడ్డి,  నర్సింగరావు, మంజ మల్లేశం పాల్గొన్నారు.