ఖాకీల్లో పెచ్చుమీరుతున్న అవినీతి!

ఖాకీల్లో పెచ్చుమీరుతున్న అవినీతి!
  • పోలీస్ బాసులు హెచ్చరించినా మారని తీరు
  •     స్టేషన్‌‌కు వచ్చే బాధితులకు రిసెప్షన్ నుంచే వేధింపులు
  •     స్టేషనరీ ఖర్చులు సహా చార్జ్​షీట్ ఫైల్‌‌ చేసే దాకా ఇవ్వాల్సిందే
  •     బాధితులైనా, నిందితులైనా అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న ఖాకీలు
  •     మధ్యవర్తులతో సివిల్ సెటిల్‌‌మెంట్లు, కుదరకపోతే కేసులతో వేధింపులు
  •     మూడు నెలల వ్యవధిలో ఏసీబీకి చిక్కిన 12 మంది అవినీతి ఆఫీసర్లు

“ ఫేక్ పాస్‌‌ పోర్ట్‌‌ కేసులో ఓ నిందితుడు దొరకగా.. అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే ఆ కేసులో అతని కుటుంబ సభ్యులను ఇరికిస్తామని రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​ (ఆర్జీఐఏ) పోలీస్ ఔట్​పోస్ట్ ​ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ కనకయ్య, ఎస్‌‌ఐ సిద్ధేశ్వర్ బెదిరించారు. నిందితుడిపై చార్జ్​​షీట్‌‌ ఫైల్‌‌ చేయడంతో పాటు కుటుంబ సభ్యులను కేసులో ఇరికించొద్దంటే రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. చివరకు రూ.5 లక్షలకు డీల్ ఓకే అయింది. పోలీసుల వేధింపులు భరించలేని నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచాల మైకంలో ఉన్న ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌, ఎస్‌‌ఐ రూ. 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు’’

“సైబర్ క్రైమ్ కేసులో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‌లో పనిచేస్తున్న ఆర్‌‌ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ లంచం డిమాండ్ చేశారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్‌‌ను ఫ్రీజ్ చేయకుండా, 41ఏ కింద నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష డిమాండ్‌‌ చేశారు. ఈ లంచం కోసం ఇద్దరు ఎస్ఐలు వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. మార్చి 9న రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుబడ్డారు.

హైదరాబాద్, వెలుగు: ‘‘యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు. శాంతి భద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు. హోంగార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, పారదర్శకతతో పనిచేయాలి. పోలీస్ స్టేషన్లకు వచ్చే పేదలు, బలహీన వర్గాల పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి న్యాయం చేయాలి. 

పోలీస్ స్టేషన్లను సివిల్ సెటిల్మెంట్లకు వేదికగా మార్చవద్దు. క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదు” అంటూ ఇటీవల డీజీపీ శివధర్​రెడ్డి పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. డీజీపీ స్థాయి అధికారి ఇంతటి కఠిన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. అవినీతిలో పెచ్చుమీరుతూనే ఉన్నారు. 

ఇటీవల ఎక్కువ మంది పోలీసులే ఏసీబీకి పట్టుబడడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు, నిందితులకు స్టేషన్‌‌ బెయిల్‌‌, చార్జ్​షీట్ దాఖలు ఇలా ప్రతి దాంట్లో అందినకాడికి దండుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌‌లో ఎలాంటి పనులు కావాలన్నా సరే.. రిసెప్షన్‌‌లో స్టేషనరీ ఖర్చులు సహా కోర్టు కానిస్టేబుల్‌‌ వరకు అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. ఇలా  ప్రతీ పనికి ఓ రేట్‌‌ ఫిక్స్‌‌ చేసి వసూలు చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బందితో కలెక్షన్‌‌ చేయిస్తూ.. మధ్యవర్తులతో సెటిల్‌‌మెంట్లు చేయిస్తున్నారు. 

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్‌‌‌‌ రెడ్డి పలుమార్లు హెచ్చరించినా.. అవినీతి పోలీసుల్లో మాత్రం మార్పురావడం లేదు. ఇందుకు ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో మీడియేటర్ సహా ఏకంగా 12 మంది పోలీసులు ఏసీబీకి చిక్కడం అద్ధం పడుతోంది. దీంతో పోలీస్‌‌ బాసులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో అవినీతి అధికారుల చిట్టా సేకరిస్తున్నారు. స్పెషల్‌‌ బ్రాంచ్‌‌, ఇంటెలిజెన్స్‌‌ ద్వారా డేటా సిద్ధం చేస్తున్నారు.    

పోలీసుల అవినీతి గుట్టురట్టు ఇలా..

పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లే సామాన్యులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నట్టు పోలీస్‌‌ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన కేసుల పరిశీలనలో అవినీతి అధికారుల గుట్టురట్టు అయింది. బాధితుల కష్టాలను వినాల్సిన రిసెప్షన్‌‌ సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆపదలో వచ్చిన వారికి రిసెప్షన్‌‌లోనే సరైన సేవలు అందడం లేదు. వీటితో పాటు స్టేషన్‌‌లో సీనియర్లుగా ఉన్న ఏఎస్‌‌ఐలు, సెక్టర్ ఎస్‌‌ఐలు సివిల్ సెటిల్‌‌మెంట్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 

ఇందుకోసం మధ్యవర్తులనూ వినియోగిస్తున్నారు. ఈ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. స్టేషన్‌‌కు వచ్చే వారి అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఖాకీలు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఓవైపు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, నేరస్తులకు సహకరిస్తున్నారనే  ఫిర్యాదులు స్థానిక యూనిట్‌‌ ఉన్నతాధికారులకు సహా పోలీస్ హెడ్‌‌ క్వార్టర్స్‌‌కు వస్తున్నాయి. స్థానిక రాజకీయ నాయకులు, మీడియేటర్స్‌‌తో సివిల్‌‌ సెటిల్మెంట్స్‌‌ జరుపుతున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. క్రిమినల్‌‌ కేసుల్లో కూడా స్థానిక లీడర్లు ప్రభావితం చేస్తున్నారని సమాచారం.

అవినీతి అధికారులపై అంతర్గత విచారణ

ఈ క్రమంలోనే  అవినీతి పోలీసులు ఇటీవలి కాలంలో ఏసీబీకి రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుబడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. బాధితులు, కేసుల్లో నిందితుల వద్ద వారి ఆర్థిక స్థోమతను బట్టి అందినకాడికి దండుకుంటున్నట్టు ఏసీబీ పరిశీలనలో వెల్లడైంది. ఇలా వరుస ఘటనలతో డిపార్ట్‌‌మెంట్‌‌లో పేరుకుపోయిన అవినీతిపై పోలీస్‌‌ బాసులు హెచ్చరించినా.. ఫలితం మాత్రం శూన్యం. ఇలాంటి వ్యవహరాలకు చెక్‌‌ పెట్టేందుకు పోలీస్ బాసులు  విభాగాల వారీగా అవినీతి అధికారుల చిట్టా రాబడుతున్నారు.స్పెషల్‌‌బ్రాంచ్‌‌, ఇంటెలిజెన్స్‌‌తో రిపోర్ట్స్‌‌ తెప్పించుకుంటున్నారు. 

అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై డీసీపీ స్థాయి అధికారి చేత అంతర్గత విచారణ జరిపిస్తున్నారు. రిపోర్ట్‌‌లో నిజానిజాలకు తగ్గట్టుగా బాధ్యులైన వారిపై అటాచ్‌‌మెంట్‌‌ లేదా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన కేసుల్లో స్థానిక సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.