ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణ హామీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణ హామీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2022ని భారత్లో నిర్వహించేందుకు హామీలపై సంతకం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం భారత్లో ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుందని హామీ ఇచ్చారు. కేంద్రం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే బడ్జెట్లో నిధులు కూడా పెంచామని తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ ద్వారా క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 

తొలిసారి ఆతిథ్యం..
అక్టోబర్ 11 నుంచి 30వ తేదీ వరకూ ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. భువనేశ్వర్, నవీ ముంబై, గోవాలో మ్యాచులు నిర్వహించే అవకాశం ఉంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వరల్డ్ కప్ పోటీల ఏడో ఎడిషన్కు భారతదేశం మొదటిసారి గా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 2017లో ఫీఫా అండర్-17 మెన్స్ వరల్డ్ కప్ కు లభించిన స్పందనకు కొనసాగింపుగా..ఈ వరల్డ్ కప్ జరగనుంది. వరల్డ్ కప్ ద్వారా దేశంలో మహిళల ఫుట్ బాల్లో ఒక చరిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. ఈ టోర్నీలో వరల్డ్ వైడ్గా అత్యుత్తమ యువ మహిళా ఫుట్ బాల్ ప్లేయర్లు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఉమెన్స్ ప్లేయర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే వీలు కలుగుతుంది. 

ఆర్థిక సాయం..
ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్కు రూ.10 కోట్ల సాయం అందిస్తోంది. గ్రౌండ్, స్టేడియంలో విద్యుచ్ఛక్తి, ఇంధనం వంటి అవసరాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.