వాషింగ్టన్ లో ‘ఖలిస్తానీ’ కుట్ర భగ్నం

వాషింగ్టన్ లో ‘ఖలిస్తానీ’ కుట్ర భగ్నం

వాషింగ్టన్​ : వాషింగ్టన్​లోని  భారత ఎంబసీ వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడాలనే  ఖలిస్తాన్​ వేర్పాటువాదుల కుట్రను అమెరికా సీక్రెట్​ సర్వీస్ విభాగం​భగ్నం చేసింది. లండన్, శాన్​ఫ్రాన్సిస్కో తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిలువరించింది. శనివారం వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ఎదుట సిక్కు వేర్పాటువాదులు పెద్దసంఖ్యలో ధర్నాకు దిగారు. ఈసందర్భంగా ఖలిస్తాన్​ మద్దతుదారులు.. భారత్​కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత ఎంబసీపై దాడి చేయాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. భారత్​ లోనూ అలజడి సృష్టించాలని ఇంకొందరు  రెచ్చగొట్టే కామెంట్స్​ చేశారు. ఈక్రమంలో పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో అమెరికా సీక్రెట్​ సర్వీస్​విభాగం రంగంలోకి దిగింది.

రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రభావితులైన ఐదుగురు నిరసనకారులు భారత ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించారు. ఈక్రమంలో అక్కడే మఫ్టీలో ఉన్న అమెరికా సీక్రెట్​ సర్వీస్​ సిబ్బంది.. వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. నిరసన తెలిపే చోటును దాటి ముందుకొస్తే ఊరుకునేది లేదని వార్నింగ్​ ఇచ్చారు. దీంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు. వాషింగ్టన్​ లో నిరసన జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న  పార్కులో రెండు కట్టెల మోపులను తమ రిపోర్టర్​ గుర్తించాడని భారత్​కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఒక మోపులోని 20 కర్రలను ఖలిస్తాన్​ జెండాలను కట్టడానికి వాడగా..  మరో దాన్ని పార్కులోనే పెట్టి వెళ్లారని పేర్కొంది.