ఎన్డీఏ ఉప రాష్ర్టపతి అభ్యర్థి జగదీప్‌ గెలుపు లాంఛనమే..!

ఎన్డీఏ ఉప రాష్ర్టపతి అభ్యర్థి జగదీప్‌ గెలుపు లాంఛనమే..!

ఉప రాష్ర్టపతి ఎన్నిక గెలుపు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి, విపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధంఖర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా ఎన్నిక బరిలో ఉన్నారు. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకురాలు. గతంలో రాజస్థాన్‌ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్‌ రాజస్థాన్‌కు చెందిన జాట్‌ నాయకుడు. 

లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకాశ్మీర్ నుంచి 4 స్థానాలు, త్రిపుర నుంచి 1 స్థానం, ఇక నామినేటెడ్ నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో 780 మంది ఎంపీలు (రాజ్యసభ, లోక్ సభ) ఉప రాష్ర్టపతి ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 

ఓటింగ్ కు దూరంగా టీఎంసీ సభ్యులు 


తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 23 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. అయితే.. ఉప రాష్ర్టపతి ఎన్నికకు తమ పార్టీ దూరంగా ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో టీఎంసీకి చెందిన 36 మంది సభ్యులు ఎన్నికకు దూరంగా ఉండడం వల్ల మిగిలిన 744 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ ఎన్నికకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది.

ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన మెజార్టీ ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగదీప్ ధంఖర్ గెలుపు దాదాపు లాంఛనమే. బీజేపీకి లోక్‌సభలో 303 మంది, రాజ్యసభలో 91 మంది సభ్యులు ఉన్నారు.  అంటే 394 మంది సభ్యుల మద్దతు జగదీప్ ధంఖర్ కే ఉంది. అంతేకాదు.. శివసేన, జనతాదళ్‌ (యూ), బీఎస్పీ, బీజేడీ, ఏఐఏడీఎంకె, వైసీఆర్ సీపీ, తెలుగుదేశం, శిరోమణి అకాళీదళ్‌, ఎల్‌జేపీ, ఏజీపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ఎంఎన్‌ఎఫ్‌, ఎస్‌కేఎం, ఎన్‌డీపీపీ, ఆర్‌పీఐ-ఎ, పీఎంకె, అప్నాదళ్‌, ఏజేఎస్‌యు, టీఎంసీ-ఎం సభ్యుల మద్దతు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగదీప్ ధంఖర్ కే ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థికి 544 ఓట్లు పడే అవకాశాలున్నాయి. అంటే ఎలక్టోరల్‌ కాలేజీలో 73% ఓట్లు జగదీప్ ధంఖర్ కే పడే అవకాశాలున్నాయి. 

మార్గరెట్ అల్వాకు ఏ పార్టీ మద్దతు...? 
విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 26 శాతం అంటే సుమారు 200 ఓట్లు పడే అవకాశం ఉంది. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర వామపక్ష పార్టీల ఎంపీల మద్దతు ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా, టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా ఉన్న శివసేన ఎంపీలు 9మంది అల్వాకు మద్దతు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 32 శాతం ఓట్లు వచ్చాయి.

పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.