తమ సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. ఊర్లోకి రావొద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు

తమ సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. ఊర్లోకి రావొద్దంటూ  గ్రామస్తులు అడ్డుకున్నారు

తమ సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. ఊర్లోకి రావొద్దంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను రంగారెడ్డి జిల్లాలోని అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. ‘ఊర్లో రోడ్లు, డ్రైనేజీ గిట్లనే ఉంటదా? ఏనాడూ ఊరు గురించి పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారు’ అంటూ నిలదీశారు. డబ్బులు చెల్లించిన మూడేండ్లకు గొల్లకుర్మలకు గొర్రెలు ఇచ్చారని మండిపడ్డారు.

చేవెళ్ల, వెలుగు: ఎమ్మెల్యే కాలె యాదయ్యను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామంలోని సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ‘‘శుభోదయం” కార్యక్రమంలో భాగంగా బుధవారం అల్లవాడలో యాదయ్య పర్యటించారు. ఈ క్రమంలో ఊర్లోని సమస్యలపై ఆయనను జనం నిలదీశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు బాగా లేవని.. ఏనాడూ వాటి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మళ్లీ ఇప్పుడు ‘‘శుభోదయం’’ కార్యక్రమం పేరుతో ఊర్లోకి ఎందుకు వచ్చావంటూ ఫైర్ అయ్యారు.

తమ సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. తమ ఊరికి రావొద్దంటూ అడ్డుకున్నారు. గొల్లకుర్మలు డబ్బులు చెల్లించిన మూడేండ్లకు గొర్రెలు ఇచ్చారని మండిపడ్డారు. ఆ టైమ్ లో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు ఇప్పుడు ఉన్నాయా? అని ఎమ్మెల్యే యాదయ్య అడగడంతో.. గ్రామస్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యేను అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. కాగా, గతంలో ఇతర గ్రామాల్లో ఎమ్మెల్యేను అడ్డుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అల్లవాడలో ‘‘శుభోదయం’’ కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జనం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పోలీసులు ప్రజలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.