టీఆర్ఎస్​ విజయంలో కీలకంగా సీపీఎం, సీపీఐ ఓట్లు

టీఆర్ఎస్​ విజయంలో కీలకంగా సీపీఎం, సీపీఐ ఓట్లు
  • కారును గట్టెక్కించిన కమ్యూనిస్టులు
  • టీఆర్ఎస్​ విజయంలో కీలకంగా సీపీఎం, సీపీఐ ఓట్లు 
  • ప్రచారంలోనూ ముందున్న కమ్యూనిస్టులు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు కీలకంగా మారారు. టీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంలో సీపీఎం, సీపీఐ ఓట్లు కలిసొచ్చాయి. లేదంటే టీఆర్ఎస్​ ఓడిపోయేదని వాదనలు వినిపిస్తున్నాయి. మునుగోడులోని 7 మండలాల్లోనూ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్లో ఐదుసార్లు సీపీఐ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంతో పోలిస్తే కమ్యూనిస్టులకు కొంత బలం తగ్గినా, సెగ్మెంట్ పరిధిలో పలు గ్రామాల్లో సీపీఎం, సీపీఐ సర్పంచ్​లు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలున్నారు. చౌటుప్పల్​ మున్సిపాలిటీలో వైస్​ చైర్మన్​ సహా ముగ్గురు కౌన్సిలర్లున్నారు. వీళ్ల బలాన్ని అంచనా వేసిన సీఎం కేసీఆర్.. కమ్యూనిస్టులతో మాట్లాడి వారిని పోటీ చేయకుండా, కాంగ్రెస్​కు మద్దతివ్వకుండా చేయడంతో సఫలమయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో సింగిల్​గా పోటీ చేసిన టీఆర్ఎస్, ఈసారి కమ్యూనిస్టుల మద్దతును కూడగట్టుకుంది. బీజేపీ ప్రధాన శత్రువుగా భావించే కమ్యూనిస్టులు టీఆర్​ఎస్​కు మద్దతివ్వడంపై విమర్శలు రావడంతో.. తాము మొదట్నుంచీ బీజేపీకి వ్యతిరేకమని, గెలిచే పార్టీకే తమ మద్దతు అని కామ్రేడ్లు ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ప్రచారంలోనూ సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు కీలకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలే బాహాటంగా ప్రకటించారు.

కామ్రేడ్ల ఓట్లే గెలిపించాయా?

మునుగోడు సెగ్మెంట్లో కమ్యూనిస్టులకు 12 వేల నుంచి15 వేల ఓట్లుంటాయని అంచనా. ప్రస్తుతం టీఆర్ఎస్​అభ్యర్థికి 10,309 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ లెక్కన  సీపీఎం, సీపీఐ ఓట్లు కీలకంగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోపక్క చౌటుప్పల్​లో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని ఆపార్టీ ఆశించింది. కానీ ఫస్ట్ రౌండ్ టీఆర్​ఎస్​ కు రాగా, తర్వాతి 2 రౌండ్లు బీజేపీ లీడ్​లో ఉంది. తొలిరౌండ్​ బీజేపీని కాస్త దెబ్బతీసింది. ఈ రౌండ్​లో జైకేసారం, నెలపట్ల, ఎస్ లింగోటం, కుంట్లగూడెం, మందోల్లగూడెం, చిన్నకోడూరు, పెద్ద కోడూరు, పంతంగి తదితర గ్రామాలకు చెందిన ఓట్లు లెక్కించగా, టీఆర్​ఎస్​ లీడ్​లో ఉంది. ఈ గ్రామాల్లో సీపీఎం బలంగా ఉంటుంది. నారాయణపురంలోనూ సీపీఎం, సీపీఐ పార్టీలకు పట్టుంది. చండూరు, నాంపల్లి, మర్రిగూడెంలో సీపీఐకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇవన్నీ టీఆర్​ఎస్​ విజయంలో కీలకంగా మారాయనే చెప్పవచ్చు. కమ్యూనిస్టుల ఓట్లతో పాటు ఆ పార్టీల కార్యకర్తలు చేసిన ప్రచారమూ కూసుకుంట్ల గెలుపునకు దారితీసిందని విశ్లేషకులు చెప్తున్నారు.