మహా ధనవంతుల సంపదే పెరిగింది... దానాలు తగ్గినయ్​!

మహా ధనవంతుల సంపదే పెరిగింది... దానాలు తగ్గినయ్​!
  • మహా ధనవంతుల సంపదే పెరిగింది... దానాలు తగ్గినయ్​!
  • గత ఆరేళ్లలో సుమారు రూ. 22 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్లకు తగ్గిన దానాల విలువ
  • ఇదే టైములో సాధారణ ప్రజలు చేసే దానాలు పెరిగాయ్

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: గత ఆరేళ్లలో దేశంలోని మహా ధనవంతుల సంపద పెరిగినప్పటికీ, సమాజం కోసం వీరు చేసిన దానాలు  మాత్రం భారీగా తగ్గాయి. రూ. వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న అల్ట్రా హై నెట్‌‌‌‌ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఐ) చేసిన దానాలు 2021 మార్చి నాటికి రూ. 12,000 కోట్లకు తగ్గాయి. ఆరేళ్ల కిందట చేసిన దానాల విలువతో పోలిస్తే ఇది 40 శాతం తక్కువని ఇండియా ఫిలాంత్రపీ రిపోర్ట్ 2022  వెల్లడించింది. మరోవైపు ఏడాదికి రూ. 1.5 లక్షల కంటే తక్కువ దానం చేసే  సాధారణ వ్యక్తులు పెరిగారు. సాధారణ ప్రజలు 2015 లో రూ. 21 వేల కోట్లను సమాజం కోసం దానం చేయగా, 2020–21 లో ఈ నెంబర్ రూ. 28 వేల కోట్లకు పెరిగింది.  ఇది 33 శాతం పెరుగుదుల. ఈ రిపోర్ట్ ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాలలో రూ. 1000 కోట్లను మించి సంపద ఉన్న ధనవంతులు సంఖ్య 20 శాతం పెరిగింది. ఇదే టైమ్‌‌‌‌లో వీరి మొత్తం సంపద రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 9 లక్షల కోట్లకు ఎగిసింది. అంతేకాకుండా రూ. 5,000 వేల కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న ధనవంతుల ఆస్తి కూడా 80 శాతం ఎక్కువయ్యింది. 

సీఎస్‌‌‌‌ఆర్ ఖర్చులు పెరిగాయ్‌‌‌‌
మరోవైపు కార్పొరేట్‌‌‌‌ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) కింద కంపెనీలు చేసే ఖర్చులు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెరిగాయని ఇండియా ఫిలాంత్రపీ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం ఫిలాంత్రఫిక్ కంట్రిబ్యూషన్స్‌‌‌‌లో కంపెనీలు సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కింద చేసిన ఖర్చుల వాటా పెరిగింది.  ఆర్థిక సంవత్సరం 2015–16 లో ఈ వాటా 12 శాతంగా ఉండగా, 2020–21 లో 23 శాతానికి పెరిగింది. లిస్టెడ్​ కంపెనీలు తమ నెట్‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌లో 2 % వాటాను కచ్చితంగా సీఎస్‌‌‌‌ఆర్ పనుల కోసం కేటాయించాలని 2014 లో ప్రభుత్వం రూల్ తెచ్చింది. ఈ రూల్‌‌‌‌ వలన సీఎస్‌‌‌‌ఆర్ కంట్రిబ్యూషన్ బాగా పెరిగిందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. కాగా, సమాజం కోసం కంపెనీలు చేసే ఖర్చులు పెరిగినా, ధనవంతులు వ్యక్తిగతగంగా చేసే దానాలు తగ్గుతున్నాయి. సీఎస్ఆర్‌‌‌‌‌‌‌‌ కింద కంపెనీలు చేసే ఖర్చులు పెరగడంతో  దానాల్లో ప్రైవేట్ సెక్టార్ వాటా మెరుగుపడుతోంది. ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ సమాజం కోసం చేసే ఖర్చులు ఏడాదికి 12% చొప్పున పెరుగుతాయని  ఈ రిపోర్ట్ అంచనావేసింది. ఆర్థిక సంవత్సరం 2025–26 నాటికి ప్రైవేట్ సెక్టార్ ఫిలాంత్రపీ కోసం కేటాయించే ఫండ్స్‌‌‌‌ వాల్యూ రూ.1.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని వివరించింది.  కన్సల్టింగ్ కంపెనీ బెయిన్, నాన్ ప్రాఫిట్ వెంచర్ ఫిలాంత్రపీ ఫండ్ దాస్రాలు ఈ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేశాయి. గత రెండేళ్లను పరిగణనలోకి తీసుకుంటే,  అల్ట్రా హై నెట్‌‌‌‌వర్త్ ఇండివిడ్యువల్స్ ఫిలాంత్రపీ పనుల కోసం చేసే ఖర్చులు కూడా పెరిగాయి.  కానీ, పెరిగిన సంపదతో పోలిస్తే వీరు దానం చేసిన  ఫండ్స్‌‌‌‌ తక్కువగా ఉన్నాయి. ఒక్క విప్రో అజీమ్ ప్రేమ్‌‌‌‌జీ మినహా మిగిలిన అల్ట్రా హై నెట్‌‌‌‌వర్త్‌‌‌‌ ఇండివిడ్యువల్స్ సమాజం కోసం చేసిన ఖర్చులు వారి సంపద పెరుగుదలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. 

ఫౌండేషన్ల ద్వారా చేసే దానాలు తగ్గాయి..
హై నెట్‌‌‌‌వర్త్ ఇండివిడ్యువల్స్‌‌‌‌, అల్ట్రా హై నెట్‌‌‌‌వర్త్‌‌‌‌ ఇండివిడ్యువల్స్‌‌‌‌ గత ఆరేళ్లలో  ఫ్యామిలీ ఫౌండేషన్ల ద్వారా చేసిన దానాలు కూడా తగ్గాయని ఫిలాంత్రపీ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం ప్రైవేట్ సెక్టార్ 2015 చేసిన ఫిలాంత్రపీ ఖర్చుల్లో ఫ్యామిలీ ఫౌండేషన్ల వాటా 37 శాతంగా ఉంది. 2020–21 నాటికి ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 11 శాతానికి తగ్గింది. హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ సమాజం కోసం చేసే ఖర్చులు ఒక్కో ఏడాదిలో ఒక్కోలా ఉన్నాయని బెయిన్‌‌‌‌కు చెందిన రాధిక శ్రీధరన్ పేర్కొన్నారు. ఒక ఏడాది రూ. 2 వేల కోట్లను ఫిలాంత్రపీ పనుల కోసం ఖర్చు చేస్తే, మరోక ఏడాదిలో రూ. 20 వేల కోట్లను కేటాయించడం కూడా చూడొచ్చని అన్నారు. మొత్తం 100 మంది అల్ట్రా హై నెట్‌‌‌‌వర్త్ ఇండివిడ్యువల్స్‌‌‌‌ చేసే దానాలను  పరిశీలించి ఈ రిపోర్ట్‌‌‌‌ను తయారు చేశారు. హై నెట్‌‌‌‌ వర్త్ ఇండివిడ్యువల్స్ ఒకే సారి పెద్ద మొత్తంలో దానాలు చేయడానికి ఇష్టపడుతున్నారని రాధిక అభిప్రాయపడ్డారు. సగటున ఏడాదిలో రూ. 5 కోట్లను దానం చేస్తే, ఆ తర్వాత రెండేళ్ల వరకు దానాలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. సంపదలో పర్సంటేజ్‌‌‌‌ లెక్కన చేసే దానాలూ తగ్గాయని పైన పేర్కొన్న రిపోర్ట్ వెల్లడించింది. 10 మంది మహా ధనవంతులు ఏడాదికి రూ. 50–100 కోట్లను దానం చేశారని, మిగిలిన మహా ధనవంతులు ఏడాదికి సగటున రూ. 15 కోట్లను దానం చేశారని ఈ రిపోర్ట్ వెల్లడించింది. మిగిలిన సెక్టార్లతో పోలిస్తే టెక్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని ధనవంతులు ఎక్కువగా దానం చేస్తున్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది.