హసన్‌పర్తి, వెలుగు : ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు స్టూడెంట్లు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ (టీజీసీహెచ్‌ఈ) వి. బాలకిష్టారెడ్డి చెప్పారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కామర్స్ కాలేజీ సెమినార్ హాల్‌లో మంగళవారం జరిగిన మెగా జాజ్‌మేళాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల సిలబస్‌లో సమగ్ర మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి కోర్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పించేలా సిలబస్ రూపకల్పన జరుగుతోందన్నారు.
డిగ్రీతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. నేటి విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
