న్యూయార్క్: పెడిక్యూర్ ట్రీట్మెంట్ వికటించడంతో ఓ మహిళ ఏకంగా తన కాలునే కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 55 ఏండ్ల క్లారా షెల్ మాన్కు ఎదురైన పరిస్థితి ఇది. పాదాలు అందంగా ఉండాలని క్లారా 2018లో టంపాలోని టామీస్ నెయిల్ పార్లర్‌కి వెళ్లింది. కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా పాదానికి స్వల్ప గాయమైంది. అప్పటికే ఆమెకు నరాల జబ్బు(పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్) ఉండటం కారణంగా చిన్న గాయం కాస్తా ఇన్ఫెక్షన్ అయి కాలు మొత్తం పాకింది. దీంతో డాక్టర్లు ఆమె కాలును పూర్తిగా తొలగించారు. మూడేండ్లుగా ట్రీట్మెంట్ కోసం తన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటూ నష్టపరిహారం కోసం పార్లర్‌పై క్లారా కోర్టుకెక్కారు. తమ తప్పును ఒప్పుకున్న టామీస్ పార్లర్ నిర్వాహకులు.. కోర్టు ఆదేశాల మేరకు ఆ మహిళకు రూ.13 కోట్ల నష్టపరిహారం చెల్లించారు.
