కన్నీళ్లు మిగిల్చిన ఆ మహా విషాదానికి ఏడాది

కన్నీళ్లు మిగిల్చిన ఆ మహా విషాదానికి ఏడాది

ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన  పాపికొండలు బోటు ప్రమాద ఘటనకు ఏడాది నిండింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయిన వశిష్ఠ పున్నమి రాయల్  బోటు ఘటన స్థానికులను వెంటాడుతూనే ఉంది. ప్రమాద సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. ఘటనలో  ఏపీ, తెలంగాణలకు చెందిన 51 మంది జలసమాధి అయ్యారు. 26 మందిని స్థానికులు కాపాడారు.

అప్పట్లో  నదిలో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో 300 అడుగుల లోతున ఉన్న బోటు వెలికితీతకు ఆటంకం కలిగింది. NDRF, నౌకాదళం బృందాలు, అగ్నిమాపకశాఖకు చెందిన వందలా మంది సుదీర్ఘంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దీంతో బోటును వెతకడానికి కాకినాడలోని ధర్మాడి సత్యం అనే ప్రైవేటు వ్యక్తితో  22 లక్షల 70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన బృందం సుదీర్ఘ శ్రమ అనంతరం 38 రోజుల తర్వాత బోటును బయటికి లాగారు. గాలింపులో 46 మృతదేహాలు లభ్యమవగా….. అందులో అయిదుగురిని గుర్తించలేకపోయారు.

నదిలో భారీగా పేరుకుపోయిన ఇసుక మేటలు, పెద్ద రాయి కారణంగా బోటు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఏపీ సీఎం జగన్ హామీతో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడినవారికి 3 లక్షలు, స్వల్పంగా గాయపడిన, గాయాలు లేకుండా బయటపడిన వారికి లక్ష చొప్పున ఇచ్చారు. తెలంగాణ వారికి అక్కడి ప్రభుత్వం 5 లక్షల చొప్పున అదనంగా అందించింది. కేంద్ర ప్రభుత్వమూ 2 లక్షల చొప్పున ఇచ్చింది.