ఎమ్మెల్యే భర్త నన్ను చంపేస్తాడు..

ఎమ్మెల్యే భర్త  నన్ను చంపేస్తాడు..
  • హరిప్రియ పీఏ, టీఆర్ఎస్ నేత భార్గవ్ తో కూడా ప్రాణభయం
  • న్యాయం చేయాలంటూసెల్ టవర్ ఎక్కిన యువకుడు
  • అడిషనల్ కలెక్టర్ హామీతో కిందికి దిగిన సుదర్శన్
  • కొత్తగూడెంలో టెన్షన్ టెన్షన్

ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ భర్త భానోత్​ హరిసింగ్​, ఎమ్మెల్యే పీఏ భార్గవ్​, టీఆర్ఎస్​ నేత యలమద్ధి రవిలతో తనకు ప్రాణభయం ఉందని ఇల్లెందుకు చెందిన దళిత యువకుడు నిట్టా సుదర్శన్​ కొత్తగూడెంలో సెల్​ టవర్​ఎక్కాడు. అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. తర్వాత మాట్లాడుతూ తనది ఇల్లెందు మండలం రాఘబోయినగూడెం అని,  తన అన్న రాంబాబు ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరుపున పోటీ చేసి ఓడిపోయారన్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే భర్త హరిసింగ్​తో పాటు టీఆర్​ఎస్​ నేత యలమద్ది రవి, ఎమ్మెల్యే పీఏ భార్గవ్​ తనతో పాటు తన కుటుంబసభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వాళ్ల పార్టీలో చేరాలంటూ ఒత్తిడి తెచ్చారని, వినకపోవటంతో తనపై ఇప్పటికి మూడు సార్లు దాడి చేశారన్నారు. తనను హత్య చేసే క్రమంలో జరిగిన దాడిలో తన చేతి వేలును కోల్పోయానన్నాడు. తనకు ప్రాణభయం ఉందని, తానపై దాడి చేశారంటూ హరిసింగ్​తో పాటు భార్గవ్​, యలమద్ది రవిలపై ఇల్లెందు పోలీస్​ స్టేషన్​ లో కేసు పెడితే పోలీసులు తననే కొట్టారన్నారు. వాళ్లు తనను ఎప్పుడైనా చంపే అవకాశం ఉందని అడిషనల్​ కలెక్టర్​ ఎదుట వాపోయాడు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరగా విచారించాలని, హరిసింగ్​, భార్గవ్​, రవిలపై కేసులు పెట్టి అరెస్టు చేసి, తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీంతో సుదర్శన్​ నుంచి కంప్లయింట్​తీసుకోవాలని కొత్తగూడెం తహసీల్దార్​ రవి, సీఐ రాజులను అడిషనల్​ కలెక్టర్​ ఆదేశించారు. ఇదిలా ఉండగా దాదాపు రెండున్నర గంటల పాటు  సుదర్శన్​ సెల్​టవర్​పైనే  ఉండటంతో కొత్తగూడెంలోని పోస్టాఫీస్​ సెంటర్​లో కొంత టెన్షన్​వాతావరణం నెలకొంది.