తీర్మానాలేనా.. చర్యలు తీసుకోరా?

తీర్మానాలేనా.. చర్యలు తీసుకోరా?
  • సిద్దిపేట జడ్పీ మీటింగ్​లో ఆఫీసర్లను నిలదీసిన సభ్యులు 

సిద్దిపేట, వెలుగు :  ‘జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడిన తరువాత 13 మీటింగ్​లు జరిగితే, తీర్మానాలపై అధికారులు తీసుకున్న చర్యలేమిటో ఏ ఒక్క సమావేశంలో కూడా వివరాలను ఇవ్వలేదు. చర్యలు తీసుకోకుండా సమావేశాలను తీర్మానాలకే  పరిమితం చేస్తే  లాభమేంటి’ అని సిద్దిపేట జడ్పీ మీటింగ్​లో పలువురు సభ్యులు ప్రశ్నించారు. శనివారం జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది.  వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా మద్దూరు జడ్పీటీసీ సభ్యుడు కొండల్ రెడ్డి మాట్లాడారు. క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నా తమకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. దీనిపై జడ్పీ చైర్మన్​ స్పందిస్తూ ఇకపై ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల క్రాప్ లోన్ అకౌంట్లలో రైతు బంధు జమ చేయడంతో బ్యాంకర్లు వారిని ఇబ్బంది పెడుతున్నారని, కల్యాణలక్ష్మి చెక్కుల మంజూరు విషయంలో గెజిటెడ్ సంతకాలు కావాలని ఒత్తిడి తేవడం లబ్ధిదారులకు ఇబ్బందిగా మారిందని వర్గల్ జడ్పీటీసీ బాలమల్లు  పేర్కొన్నారు. దీనికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​ స్పందిస్తూ ఎవరికి ఇబ్బంది కలిగించవద్దని అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.

రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి మాట్లాడుతూ ఎకరం, రెండెకరాల భూములున్న రైతులందరికీ స్ర్పింకర్లు అందజేయాలని కోరారు. గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం మాట్లాడుతూ గజ్వేల్ మండల పరిధిలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, పలు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తినా పరిష్కారం కావడం లేదని ఆఫీసర్ల దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సమాధానం ఇస్తూ త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గజ్వేల్ జడ్పీటీసీ మల్లేశం, గజ్వేల్ ఎంపీపీలు మాట్లాడుతూ కొడకండ్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తాము చేసిన ఫిర్యాదుపై ఏం చర్య తీసుకున్నారని ప్రశ్నించగా అతడిని మందలించినట్టు డీఈవో చెప్పారు.  మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు మాట్లాడుతూ పెద్ద చెప్యాల హైస్కూల్ భూమిని కాపాడేలా చర్యలు తీసుకోవాలని గత సమావేశాల్లో తాను ప్రస్తావించినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవెన్యూ ప్లాంటేషన్ జరగాలి

‘అటు మట్టి ఇటు.. ఇటు మట్టి అటు,  పది మంది పనిచేస్తే ఇరవై మంది రాసుడు కాదు.. సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరేలా ఎవెన్యూ ప్లాంటేషన్ జరగాలి’ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. డీఆర్డీవోపై చర్చ సందర్భంగా దుద్దెడ చౌరస్తా నుంచి చేర్యాల వరకు విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, అన్ని రోడ్లు రాజీవ్ రహదారిలో కనిపించేలా చేయాలని సూచించారు. ఈజీఎస్ పనుల గురించి అడిగితే జంగల్ క్లీనింగ్, చెరువుల్లో మట్టి తరలింపు,  పనులు చేపడుతున్నారని, హరితహారం కార్యక్రమానికి అనుగుణంగా పనులు జరిగితే మంచిదని సూచించారు. కొన్ని పనులను చూస్తుంటే కోసం వస్తోందని, ఈజీఎస్ పనుల్లో హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఫారుఖ్​హుస్సేన్, యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.

ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్ష ఎందుకు?

దుబ్బాక నియోజకవర్గానికి ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని, బీజేపీ సర్పంచులు ఉన్న గ్రామాలకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ నిధులను ఎవరు కేటాయిస్తున్నారు, ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు, ఊర్లకు ప్రపోజల్స్ ఎలా పంపిస్తున్నారు, వీటి గైడ్ లైన్స్ ఏంటనేవి చెప్పాలని అధికారులను అడిగారు. బీజేపీ సర్పంచులు ఉన్న 13 గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఈజీఎస్ నిధులు ఇవ్వలేదని, ఈ విషయమై నాలుగు నెలల కింద అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే దానిపై ఇప్పటి వరకు రిప్లై ఇవ్వాలేదని తెలిపారు. ఆ ఫిర్యాదును ప్రభుత్వానికి పంపారా?  గతంలో జరిగిన అన్యాయాన్ని ఎలా భర్తీ చేస్తారు? అని ప్రశ్నించారు.

దుబ్బాక నియోజకవర్గంలోని115 గ్రామాలకు ఐదు లక్షల చొప్పున ఇవ్వాలని అధికారులను కోరగా, ఈ విషయాన్ని పరిశీలిస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో 53 మంది టీచర్లు ఉంటే ఆర్ అండ్ ఆర్ కాలనీలో 22 మంది పోగా మిగిలిన వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ముంపు గ్రామాల స్కూళ్లను మూసి వేయాలని ఎవరు ఆదేశాలిచ్చారని  ఎమ్మెల్యే  ప్రశ్నించారు.  ఎజెండా లేకుండా జడ్పీ సమావేశం ఉందని అసహనం వ్యక్తం చేశారు. చిట్టాపూర్ నుంచి దుంపలపల్లి వరకు ఐదు కిలో మీటర్ల రోడ్డు ఐదేండ్లు గడిచినా పూర్తి కాలేదు.  దీనిపై పీఆర్ఎస్ఈ స్పందించడం లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. దుబ్బాక ఐవోసీ నిర్మాణానికి రూ.9కోట్లు ముందస్తుగా చెల్లించినా మూడేండ్లుగా పనులు జరగడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఇదే పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.