గురుకుల సీట్లకు ఫుల్ డిమాండ్

గురుకుల సీట్లకు ఫుల్ డిమాండ్
  •     స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం  మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి లెటర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థల్లోని సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. స్కూళ్లలో 5, 6, 7, 8వ క్లాసులు, ఇంటర్, డిగ్రీ సీట్ల కోసం స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు అధికారులను కలు స్తూ వినతిపత్రాలు ఇస్తున్నారు. మాసబ్ ట్యాంక్​లో ని సంక్షేమ భవన్​కు రోజూ వివిధ జిల్లాల నుంచి వందల మంది స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు సీట్లు కేటాయించాలని కోరేందుకు వస్తున్నారు. 

వారి విన తిపత్రాలను అధికారులు తీసుకుంటూ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, అవి పూర్తయ్యాక సీట్లు ఉంటే ఇస్తామని చెప్తున్నారు. గురుకుల ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై కాని వాళ్లు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సీట్ల కోసం బీసీ గురుకుల, ఎస్సీ గురుకుల అధికారులను కలుస్తున్నారు. అయితే, గురుకులాల్లోని 5, 6, 7, 8వ క్లాసులలో, ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఇదివరకే ఎంట్రెన్స్ టెస్ట్​లు నిర్వహించారు. 

క్వాలిఫై అయిన వారికి సీట్లను కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. గురుకులాల్లో స్కూళ్లు, కాలేజీల్లో కలిపి మొత్తం 2.80 లక్షల సీట్లు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, గత పదేండ్లుగా గురుకులాల్లో ఇష్టారీతిగా సీట్ల కేటాయింపు చేశారని, చాలా మంది అర్హులకు సీట్లు దక్కలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ పిల్లలకు సీట్ల కోసం చాలా మంది పేరెంట్లు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల లెటర్లు సైతం తీసుకొచ్చి అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు.