టీచింగ్ 2,020.. నాన్ టీచింగ్ 2,774

టీచింగ్ 2,020.. నాన్ టీచింగ్ 2,774
  • వర్సిటీల్లో పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు
  • పలుమార్లు ఫైనాన్స్ ఆఫీసర్ల సమావేశాలు 
  • త్వరలోనే అధికారిక ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వర్సిటీల్లో ఖాళీల భర్తీపై సర్కారు దృష్టిపెట్టింది. 2,020 టీచింగ్ పోస్టులతోపాటు 2,774 నాన్‌టీచింగ్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్లతో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోస్టుల మంజూరుకు సంబంధించిన జీవోలను అధికారులు పరిశీలించారు. పోస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందా? ప్రకటించిన పోస్టుల సంఖ్యను తగ్గించే అవకాశాలు ఉన్నాయా? అనే విషయాలను రిజిస్ట్రార్లతో చర్చించారు. వర్సిటీల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 217 ప్రొఫెసర్, 775 అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్యను తగ్గించి, వాటి స్థానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందనేదానిపై  వర్సిటీ అధికారుల అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలిసింది. కాగా, పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ జీవో ఇవ్వనున్నట్టు సమాచారం.  

11 వర్సిటీల్లో 803 మందే పనిచేస్తున్నరు
రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో 2,823 టీచింగ్ శాంక్షన్డ్ పోస్టులుండగా.. ప్రస్తుతం 803 మంది పని చేస్తున్నారు. 2,020 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 392  ప్రొఫెసర్ పోస్టులు ఉండగా, 175 మంది మాత్రమే పని చేస్తుండగా 217  ఖాళీలున్నాయి. 909 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను 134 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 775 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,522 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, 494 మంది మాత్రమే ఉన్నారు. మరో 1,028 పోస్టులు ఖాళీలున్నాయి. ఉస్మానియాలో అత్యధికంగా1,267 శాంక్షన్డ్ పోస్టులకుగాను 395 మంది మాత్రమే పని చేస్తుండగా, 872 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయలో 299 పోస్టులు, తెలంగాణలో 74 , మహాత్మాగాంధీలో 35, శాతవాహనలో 45, పాలమూరులో 73, తెలుగు వర్సిటీలో 66, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 48, జేఎన్టీయూలో 347, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో 34, ఆర్జీయూకేటీలో 127 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

2,774 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ   ou
యూనివర్సిటీల్లో మొత్తం 2,774 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 4,949 శాంక్షన్డ్ పోస్టులుండగా, 2,175 మంది పనిచేస్తున్నారు. ఉస్మానియాలో అత్యధికంగా 2,075 పోస్టులు ఖాళీగా ఉండగా, కాకతీయలో 174, తెలంగాణ, మహాత్మాగాంధీలో 9 మంది చొప్పున, శాతవాహనలో 58, పాలమూరులో 14, తెలుగు వర్సిటీలో 84, అంబేద్కర్ వర్సిటీలో 90, జేఎన్టీయూలో 115, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో 53, ఆర్జీయూకేటీలో 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.