అవసరానికి మించి కొవాగ్జిన్, కొవిషీల్డ్, కార్బెవాక్స్ 

అవసరానికి మించి కొవాగ్జిన్, కొవిషీల్డ్, కార్బెవాక్స్ 

ఇప్పటికే 18 ఏండ్లు నిండినోళ్లందరికీ సెకండ్ డోస్ పూర్తి 
అందరికీ ఫ్రీగా బూస్టర్ డోసులు వేస్తేనే వీటిని వాడుకునే చాన్స్ 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 44 లక్షల కరోనా టీకా డోసులు నిల్వ ఉన్నాయి. గవర్నమెంట్ వ్యాక్సిన్ సెంటర్లలో అందరికీ బూస్టర్ డోసులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్పా, అవి ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. మన దగ్గర ఇప్పటికే 18 ఏండ్లు నిండినోళ్లందరికీ సెకండ్​ డోస్ పూర్తయింది. 60 ఏండ్లు నిండినోళ్లకు బూస్టర్ డోసు వేస్తున్నప్పటికీ, పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

ప్రస్తుతం 12---–14 ఏండ్ల లోపు పిల్లలకే వ్యాక్సినేషన్‌‌‌‌ కొనసాగుతోంది. రోజూ 25 వేల డోసులకు మించి వ్యాక్సినేషన్ జరగడం లేదు. వీళ్లకు కార్బెవ్యాక్స్‌‌‌‌ మాత్రమే వేయాలని కేంద్రం నిర్దేశించింది. దీంతో కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్ డోసులు పెద్ద ఎత్తున నిల్వ ఉన్నాయి. హైదరాబాద్‌‌‌‌లోని స్టేట్ డ్రగ్ స్టోర్‌‌‌‌‌‌‌‌లో కొవ్యాగ్జిన్, కొవిషీల్డ్‌‌‌‌, కార్బెవ్యాక్స్‌‌‌‌ కలిపి 39.23 లక్షల డోసులు ఉండగా, జిల్లాల్లోని స్టోర్లలో మరో 4.58 లక్షల డోసులు ఉన్నాయి. వీటి విలువ రూ.80.4 కోట్లు. బూస్టర్ డోసులకు కేంద్రం తొందరగా అనుమతి ఇయ్యకుంటే, వీటిలో రూ.50 కోట్లకు పైగా విలువైన డోసులు ఎక్స్ పైరీ అయిపోయే ప్రమాదం ఉంది. 

కార్బెవ్యాక్స్ 40 వేలు ఎక్కువున్నయ్... 

రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్ల పిల్లలు 11.36 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 9.11 లక్షల మంది ఫస్ట్ డోసు వేసుకున్నారు. ఇంకో 2.24 లక్షల మంది ఫస్ట్ డోసు వేసుకోవాల్సి ఉంది. వీరికి ఫస్ట్ డోసు ఇవ్వడానికి, ఆ తర్వాత అందరికీ సెకండ్ డోసు ఇవ్వడానికి ఇంకో 13.6 లక్షల కార్బెవ్యాక్స్ డోసులు సరిపోతాయి. కానీ, మన దగ్గర ఇప్పటికే 14 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. అంటే అవసరానికి మించి 40 వేలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎక్కువ డోసులు ఉండగా, ఇంకా కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. 

కొవాగ్జిన్ 12 లక్షలు.. కొవిషీల్డ్ 11 లక్షలు 

15  నుంచి17 ఏండ్ల వాళ్లకు కొవ్యాగ్జిన్ మాత్రమే వేయాలని కేంద్రం సూచించింది. మన రాష్ట్రంలో ఈ ఏజ్ గ్రూపు వాళ్లు 18.41 లక్షల మంది ఉండగా, వీరిలో ఇప్పటికే 74 శాతం మందికి రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇంకో 16 శాతం మందికి సింగిల్ డోసు పూర్తయింది. వీళ్లకు సెకండ్ డోసు వేయడానికి, ఇంకో పది శాతం మందికి రెండు డోసులు వేయడానికి 6.68 లక్షల డోసులు సరిపోతాయి. కానీ, మన దగ్గర ఏకంగా 18.67 లక్షల కొవ్యాగ్జిన్ డోసులు ఉండడం గమనార్హం. అంటే, అవసరానికి మించి సుమారు 12 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్నాయి. ఇక కొవిషీల్డ్ 11.15 లక్షల డోసులు ఉన్నాయి. వీటిని 18 ఏండ్లు నిండినోళ్లు ఎవరైనా వేసుకోవచ్చు. కానీ, 18 ఏండ్లు నిండిన వాళ్లందరికీ రాష్ట్రంలో ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 60 ఏండ్లు దాటినోళ్లు సర్కారులో బూస్టర్ డోసు వేసుకునేందుకు అవకాశం ఉన్నా, జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో బూస్టర్‌‌‌‌ ‌‌‌‌డోసు వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. 18 నుంచి 60 ఏండ్ల వయసున్న వాళ్లు కూడా బూస్టర్ డోసు వేయించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే దీన్ని కేవలం ప్రైవేటు హాస్పిటళ్లకే పరిమితం చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్ డోసులు అలాగే నిల్వ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ దవాఖాన్లలోనూ బూస్టర్ డోసు వేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కేంద్రానికి మంత్రి హరీశ్‌‌‌‌రావు లేఖ రాశారు. 

వ్యాక్సిన్ నిల్వలు ఇలా... 
వ్యాక్సిన్‌‌‌‌    డోసుల సంఖ్య
కొవాగ్జిన్    18,67,695
కొవిషీల్డ్‌‌‌‌    11,15,110
కార్బెవ్యాక్స్‌‌‌‌    13,99,300
మొత్తం    43,82,105