రూ.500 కోట్ల పనులు తుక్డా తుక్డా చేస్తున్నరు

రూ.500 కోట్ల పనులు తుక్డా తుక్డా చేస్తున్నరు
  • ఒక్కో  కాంట్రాక్టర్​కు రూ.5 లక్షల చొప్పున పనుల అప్పగింత

నల్గొండ, వెలుగు : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్గొండలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. సుమారు రూ.500 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను రూ.5 లక్షల చొప్పున ముక్కలు ముక్కలు చేసి సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు అప్పజెబుతున్నారు. దీంతో వాళ్లు రెండు మూడు గంటల్లోనే పనులు చేసి అవతల పడుతున్నారు. రూ.5 లక్షల్లోపు పనులు నామినేషన్ పద్ధతిలో ఇవ్వొచ్చన్న నిబంధనను అడ్డం పెట్టుకుని ఇష్టమున్నవాళ్లకు పనులు కట్టబెడుతున్నారు. మరోవైపు కోట్ల రూపాయల పనుల్లోనూ అటూ ఇటూగా కాస్త ఇదే పాలసీ అవలంభిస్తున్నారు. ముందుగా పనులు ప్రారంభించి..తర్వాత ఆన్​లైన్​లో టెండర్లు పిలుస్తామని చెబుతున్నారు. కానీ ఎక్కడా ఒక్క ప్రకటన కనిపించడం లేదు. పైగా లక్షలు ఖరీదు చేసే పనులకు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేస్తూ మిగిలిన డబ్బులను వేరే పనులకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే సుమారు రూ.25 కోట్ల పనులు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కాంట్రాక్టర్లు చేస్తుండగా, మరికొన్ని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు దగ్గరి కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు.  

రూ.25 కోట్ల పనులు వారికే.. 
నల్గొండలో సుమారు రూ.500 కోట్ల పైచిలుకు పనులు జరుగుతున్నాయి. జంక్షన్ల రోడ్ల దగ్గర బ్యూటిఫికేషన్, స్వాగత తోరణాలు, కాంస్య విగ్రహాలు పెట్టడం, ఆక్సిజన్, అర్బన్ పార్కులు, పట్టణ అంతర్గత పార్కులు, హరితహారం మొక్కలు నాటడం, తెలంగాణ క్రీడా మైదానాలతో కలిపి సుమారు రూ.25 కోట్ల పనులన్నీ సిద్ధిపేట, సిరిసిల్ల కాం ట్రాక్టర్లకు నామినేషన్​పద్ధతిలో అప్పగించారు. ఇటీవల ప్రభుత్వం క్రీడా మైదానాల సిద్ధం చేయాలని చెప్పగా వీటిని కూడా నామినేషన్​పద్ధతిలో వారికే ఇచ్చారు. ఒక్కో గ్రౌండ్​ అంచనా వ్యయం రూ.4 నుంచి 5 లక్షలు ఉండడంతో నాలుగైదు గంటల వ్యవధిలోనే పనులు చేసి బయట పడ్డారు. అదే విధంగా క్లాక్ టవర్ సెంటర్​లో రూ.కోటి వ్యయంతో జరుగుతున్న జంక్షన్ అభివృద్ధి పనులు కూడా సిరిసిల్ల కాంట్రాక్టర్ కే అప్పగించారు. పైకి ఆన్​లైన్ ​టెండర్ పిలిచామని చెప్తున్నా అంతకంటే ముందే కాంట్రాక్టర్​కు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు కాంట్రాక్టు సంస్థకు వెయ్యి మంది లేబర్ ఉండడంతో వారందరితోనే నల్గొండలోని జంక్షన్ పనులు చేయిస్తున్నారు. 

స్థానిక కూలీలకు ఉపాధి ఏది? 
సీఎం చెప్పిన గడువులోగా పనులు కంప్లీట్ చేయా లంటే అది ఒక్క సిద్ధిపేట, సిరిసిల్ల కాంట్రాక్టర్లతోనే సాధ్యమవుతుందని అదే లోకల్ వాళ్లకు పనులు అప్పగిస్తే నెలల తరబడి పొడిగిస్తారని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. పైగా సిద్ధిపేట, సిరిసిల్ల  కాంట్రాక్టర్లు సిద్ధహస్తులని అందుకే అటువైపు మొగ్గుచూపాల్సి వచ్చిందంటున్నారు. నల్గొండలో సుమారు 60 మంది వరకు కాంట్రాక్టర్లు ఉండగా, వీరిని నమ్ముకుని నాలుగైదు వందల మంది కూలీలు బతుకుతున్నారు. కనీసం స్థానిక కూలీలకు ఉపాధి కల్పించకుండా మొత్తం పనులు వారితోనే చేయిస్తున్నారు.  

రూల్స్​ నహీ చలేగా..
పనులు ఎంత ఫాస్ట్​గా చేస్తున్నారో బిల్లులను కూడా అంతే వేగంగా చెల్లిస్తున్నారు. పనులకు ముందుగానే టెండర్లు పిలిస్తే లోకల్ కాంట్రాక్టర్లు పాల్గొంటారని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జరిగిన పనులకు టెండర్లు పిలిస్తే లోకల్ వాళ్లు పోటీకి రారని, పైగా అప్పటికే బిల్లుల పేమెంట్స్ కూడా జరిగిపోతాయి కాబట్టి సమస్య ఉండదని అనుకుంటున్నారు. ఓవైపు పనులు, మరోవైపు బిల్లులు వెంట వెంటనే క్లియర్ చేస్తున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​, జనరల్ ఫండ్ నుంచే బిల్లులు ఇచ్చేవారు కానీ, ఇప్పుడు ప్రత్యేక ఖాతాలు తెరిచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని సిద్ధిపేట, సిరిసిల్ల కాంట్రాక్టర్లకు పంచి పెడుతున్నారని పలువురు లోకల్ ​కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ట్రెజరీకి బిల్లులు పంపకుండా డైరెక్ట్​గా పాస్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారని చెపుతున్నారు.  

ఎమ్మెల్యేకు చెప్పకుండానే రూ.10 కోట్లకు టెండర్ 
ఎమ్మెల్యేకు చెప్పకుండానే మున్సిపల్​ఆఫీసర్లు రూ.10 కోట్ల పనులను అప్పగించే ప్రయత్నం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10 కోట్లను వార్డులకు ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భావించారని, కానీ కమిషనర్ చడీచప్పుడు కాకుండా వరద కాల్వల నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున ఐదు పనులకు టెండర్లు పిలువాలని నిర్ణయించుకున్నారని కౌన్సిలర్లు చెప్పారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే టెండర్ ప్రక్రియను అడ్డుకున్నారని సమాచారం. ఐదు టెండర్లు వేర్వేరుగా పిలిస్తే పనులు లేట్ అవుతాయని, రూ. 10 కోట్లకు సింగిల్ టెండర్ పిలవాలని ఆయన పట్టుబట్టారు. ఈ వ్యవహారంలో కమిషనర్​కు, ఎమ్మెల్యేకు మధ్య కొంత వివాదం నెలకొంది. ఈ పనులను కూడా సిద్దిపేట కాంట్రాక్టర్లకు ఇవ్వాలని కమిషనర్​అనుకున్నారు. అయితే ఎమ్మెల్యే జోక్యంతో సింగిల్​ టెండర్ ​పిలిచారు.