వంద మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు..లిస్ట్ రెడీ!

వంద మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు..లిస్ట్ రెడీ!
  • సెక్రటేరియట్ లోనే ఐదుగురు ఐఏఎస్ లు
  • ఉద్యోగ విరమణ చేసినా అదే స్థానంలో..
  • ఇరిగేషన్ శాఖలోనే ఎక్కువ మంది
  • సెకండ్ ప్లేస్ లో పంచాయతీరాజ్
  • విద్యాశాఖలో 25, మిషన్ భగీరథలో10
  • అనుకూలంగా వ్యవహరించిన ఆఫీసర్లకు గత ప్రభుత్వం అందలం 
  • వారిని ఇంటికి పంపేందుకు రేవంత్ సర్కారు రెడీ
  • రెండు మూడు రోజుల్లో సీఎం చేతికి చిట్టా!

హైదరాబాద్: పదవీ విరమణ పొందిన అధికారుల జాబితా సీఎస్ కు చేరింది. రాష్ట్రం మొత్తం మీద వంద మందికిపైగా రిటైర్డ్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీళ్లలో నీటిపారుదలశాఖలో ఎక్కువ మంది విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో పంచాయతీరాజ్ శాఖలో 48 మంది ఉద్యోగ విరమణ పొందిన అధికారులు విధుల్లో ఉన్నారు. రాష్ట్రానికి గుండెకాయలా భావించే సచివాలయంలోనే ఐదుగురు రిటైర్డ్ అధికారులు విధులు నిర్వర్తిస్తుండటం విశేషం. ప్రొటోకాల్ డిపార్ట్ మెంట్లో విధులు నిర్వర్తించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అర్విందర్ సింగ్ రిటైర్డ్ అయినా అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనతో పాటు పశుసంవర్థకశాఖలో అదర్ సిన్హా, దేవాదాయశాఖలో అనిల్ కుమార్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉమర్ జలీల్, కార్మికశాఖలో రాణి కుముదిని విధుల్లో ఉండటం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం కీలకంగా భావించిన ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ అధికారుల ఆధీనంలోనే ఉంది. ఈఎన్సీలుగా  రిటైర్డ్ అధికారులు మురళీధర్ రావు, వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. వీళ్లతో పాటు ఎస్ఈలు, ఈఈలు కూడా రిటైర్డ్ అధికారులే ఉండటం గమనార్హం. 

అనుకూలంగా  పనిచేస్తే స్థానం పదిలం

గత ప్రభుత్వం తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులు రిటైరైనప్పటికీ ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి వారిని అదే స్థానంలో కొనసాగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక శాఖల్లో ఉన్న​అధిపతులకు ఈ అవకాశం కల్పించిందనే ఆరోపణలున్నాయి. రిటైర్డ్ అధికారులే కీరోల్ గా వ్యవహరించారని తెలుస్తోంది. 

రెండు రోజుల్లో సీఎంకు చిట్టా

రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపేందుకు రేవంత్  రెడ్డి సర్కారు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందుకోసం లెక్కలు తీసిన రేవంత్ సర్కారు చర్యలకు సిద్ధమవుతోంది. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోగానే జాబితాను ఆయనకు అందించేందుకు సీఎస్  సిద్ధంగా ఉన్నారు. రిటైరైప్పటికీ పదవిలో కొనసాగుతున్న పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.