
ముంబై: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలు లేవని, సరఫరా అంతరాయం కలిగితే ప్రపంచం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇరాన్, వెనిజువెలా ఉదాహరణలను ప్రస్తావిస్తూ, భారత్ ఎప్పుడూ అంతర్జాతీయ ఆంక్షలను గౌరవిస్తుందని అన్నారు. రష్యా ఆయిల్ కొంటున్నందుకు అమెరికా భారత్‌పై 25శాతం పెనాల్టీ టారిఫ్ వేసిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా 25శాతం టారిఫ్ కూడా పడుతోంది. రష్యా గ్లోబల్‌గా రోజుకు 10 మిలియన్ బారెల్స్ సరఫరా చేస్తూ ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉందని పూరి అన్నారు.
“రష్యాను పక్కన పెడితే, ఆయిల్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది” అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలుపై ధర పరిమితులు ఉన్నప్పటికీ, భారత కంపెనీలు తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని సూచిస్తున్నానని చెప్పారు. టర్కీ, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా చమురు కొనుగోలు చేస్తున్నాయని, ప్రస్తుతం రష్యా ఇచ్చే డిస్కౌంట్లు అంతగా లేవని పేర్కొన్నారు.
అమెరికా చమురు ఉత్పత్తిలో కీలక దేశంగా ఉండటంతో, ధరలు ఎక్కువగా పడకూడదని కోరుకుంటుందన్నారు. ‘‘ప్రభుత్వ చమురు సంస్థలు స్వతంత్రంగా కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటాయి. వాటికి ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్, బోర్డులు ఉన్నాయి”అని పూరి స్పష్టం చేశారు.