
- డిసైడ్ చేయనున్న సోనియాగాంధీ, ఖర్గే
- సీఎల్పీ భేటీలో అభిప్రాయాలు తీసుకున్న అబ్జర్వర్లు
- ఏకవాక్య తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు
- సీల్డ్ కవర్లో హైకమాండ్‌కు చేరిన ఒపీనియన్స్
- సోమవారం రాత్రే ప్రమాణం ఉంటుందన్న ప్రచారంతో
- రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు.. సీఎం కోసం కొత్త కాన్వాయ్ రెడీ
- మళ్లీ ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి అభిప్రాయాలు రికార్డ్ చేసిన అబ్జర్వర్లు.. అనంతరం ఢిల్లీకి పయనం
- నేడు సోనియా, ఖర్గేతో భేటీ.. అక్కడే ఫైనల్
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని మంగళవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలను రికార్డ్ చేసుకొని ఏఐసీసీ అబ్జర్వర్లు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశం అనంతరం సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఆదివారం అభ్యర్థులు గెలవగానే అదే రోజు వారందరినీ హైదరాబాద్‌లోని హోటల్ ఎల్లాకు తరలించారు. అక్కడే సోమవారం ఏఐసీసీ అబ్జర్వర్ డీకే శివకుమార్ నేతృత్వంలో సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను ఏఐసీసీ అబ్జర్వర్లు రికార్డ్ చేశారు. అభ్యర్థులంతా కలిసి ఏకవాక్య తీర్మానం చేశారు. హైకమాండ్ చెప్పినోళ్లు ఎవరైనా తమకు సీఎంగా ఓకే అంటూ తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా.. దాన్ని భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బలపరిచారు. దాన్నే సీల్డ్ కవర్లో హైకమాండ్‌కు డీకే శివకుమార్ పంపించారు. రెండు గంటల్లోనే నిర్ణయం వెలువడుతుందని డీకే శివకుమార్ ప్రకటించారు. సోమవారం రాత్రే సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణం ఉంటుందన్న ప్రచారమూ జరిగింది.
అందుకు తగ్గట్టు ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో కూడా ఏర్పాట్లు చేశారు. కానీ, సాయంత్రం దాటినా హైకమాండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు హైకమాండ్ ఆదేశాలతో ఏఐసీసీ అబ్జర్వర్లు ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి సీఎం అభ్యర్థిపై అభిప్రాయాలను తీసుకున్నారు.
వారు చెప్పిన అభిప్రాయాలను డీకే శివకుమార్ రికార్డ్ చేసుకున్నారు. కాగా, సీఎల్పీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు డీకే శివకుమార్‌తో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్‌బాబు సమావేశమైనట్టు తెలిసింది.
ఢిల్లీకి వెళ్లిన నలుగురు అబ్జర్వర్లు..ఇయ్యాల డీకే కూడా..!
సీఎం అభ్యర్థిని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే డిసైడ్ చేయనున్నారు. మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్లు డీకే శివకుమార్, దీపాదాస్ మున్షి, అజయ్ కుమార్, కె. మురళీధరన్, కె.జె. జార్జ్.. సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. వాస్తవానికి సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్‌ను నిర్వహించగా.. ఆ సమావేశంలోనే సీఎం క్యాండిడేట్‌ను సోనియా గాంధీ ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ, ఆ సమావేశంలోనూ సోనియా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
ఈ నేపథ్యంలోనే నలుగురు ఏఐసీసీ అబ్జర్వర్లు సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరారు. డీకే శివకుమార్ మాత్రం బెంగళూరుకు వెళ్లినట్టు తెలిసింది. అక్కడి నుంచి మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. సోనియా, ఖర్గేతో సమావేశం తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, మంగళవారం ప్రకటన వచ్చేందుకు చాన్స్ ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు పలువురు సీనియర్ నేతలూ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
హైకమాండ్ నుంచి వచ్చే ప్రకటనను బట్టి మరో రెండు మూడు రోజుల్లో సీఎం ప్రమాణం ఉండే అవకాశం ఉంటుందని, లేదంటే ఈ నెల 9న జరిగే అవకాశం ఉందని ఓ ఎమ్మెల్యే చెప్పారు. సీఎంతో పాటు నలుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేసే చాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కాని నేతలంతా హోటల్ ఎల్లా నుంచి వెళ్లిపోవాల్సిందిగా హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలంతా క్యాంప్‌లోనే ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. సీఎల్పీ నేత ఎన్నిక ఆలస్యమైతే వారిని బెంగళూరు క్యాంప్‌కు తరలించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
హోటల్ వద్ద సందడి
ఎమ్మెల్యేల క్యాంప్‌ను ఏర్పాటు చేసిన హోటల్ ఎల్లా వద్ద సోమవారం ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది. సీఎల్పీ నేతను ఎన్నుకునే సమావేశం కావడంతో నేషనల్ మీడియా కూడా భారీగా అక్కడికి చేరుకుంది. ఇటు హోటల్‌కు నేతల తాకిడి కూడా పెరిగింది. చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకు హోటల్ వద్దకు చేరుకున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. కొందరు లీడర్లు తమకు తెలిసిన పెద్ద స్థాయి లీడర్లతో చెప్పించుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
మరోవైపు హోటల్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎంకు భద్రత కల్పించే టీఎస్ఎస్పీ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులనూ భారీగా మోహరించారు. మరోవైపు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు.. అక్కడ స్వల్ప తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీడియా ఎక్కువగా చేరుకోవడం, కాంగ్రెస్ పార్టీ నేతలూ పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కెమెరామెన్లు కింద పడిపోయారు.
రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు
సోమవారం ఓవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుండడం, సీఎం అభ్యర్థి ఎవరన్నది కొద్ది గంటల్లోనే తేలుతుందన్న చర్చల నేపథ్యంలో.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం నుంచే రాజ్‌భవన్ వద్ద కొంత హడావుడి కనిపించింది. రాత్రి 8.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలున్నాయన్న కథనాలతో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చకచకా ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో 175 మందికి సరిపోయేలా చైర్లు వేశారు. స్టేజీని ఏర్పాటు చేసి డెకరేషన్ కూడా చేయించారు. కానీ, చివరి నిమిషంలో సీఎం అభ్యర్థి ఎంపిక లేట్ కావడంతో ఆ ఏర్పాట్లను ఆపేశారు. అక్కడి నుంచి అందరినీ పంపించేశారు.
సీఎం కోసం కొత్త కాన్వాయ్
కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ను కూడా రాజ్‌భవన్ వద్ద అధికారులు రెడీ చేసి పెట్టారు. ఆరు తెలుపు ఇన్నోవా కార్లను రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద సిద్ధం చేశారు. సీఎం ప్రమాణం పూర్తికాగానే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు కొత్త కాన్వాయ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ముందుగానే కాన్వాయ్‌ను సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి సీఎంగా కేసీఆర్ కాన్వాయ్‌లో ల్యాండ్‌క్రూజర్ కార్లుండేవి. ఆల్ సిక్స్‌ల నంబర్లతో కూడిన కార్లను కేసీఆర్ ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ప్రస్తుతం సీఎం ప్రమాణ స్వీకారానికి మాత్రం ఇన్నోవా కార్లను ఏర్పాటు చేశారు.