ఎస్ఆర్డీపీ ఫేజ్–1 పనులకు నిధుల కొరత

ఎస్ఆర్డీపీ ఫేజ్–1 పనులకు నిధుల కొరత

హైదరాబాద్, వెలుగు: స్టాటజిక్ రోడ్ డెవలప్​మెంట్​ప్లాన్(ఎస్​ఆర్ డీపీ)ఫేజ్–1 పనులకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లోన్ లిమిట్ పూర్తయ్యింది. ఇదివరకే రూ.2,995 కోట్ల లోన్ తీసుకున్న జీహెచ్ఎంసీ, కొన్ని సొంత డబ్బులను ఖర్చు పెట్టి పనులు చేసింది. ఇటీవల లోన్ లిమిట్​లో మిగతా రూ.505 కోట్లను కూడా తీసుకుంది. ఎస్ఆర్ డీపీ ఫేజ్–1లో భాగంగా రూ.5,937 కోట్లతో మొత్తం 47 పనులు చేపట్టగా.. ఇందులో ఇంకా 13 మేజర్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ మొత్తం రూ.4,500 కోట్లను ఎస్ఆర్డీపీ పనుల కోసం ఖర్చు చేసింది.  ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తి కావాలంటే ఇంకా రూ. వెయ్యి కోట్లు అవసరమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫస్ట్ ఫేజ్​కు సంబంధించి ప్రభుత్వం రూ. 3,500 కోట్ల లోన్లకు మాత్రమే అనుమతిచ్చింది, మరో వెయ్యి కోట్లు అయితే ఫస్ట్ ఫేజ్ పనులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

మిగిలిన పనులు..
ఫస్ట్ ఫేజ్​లో 17 పనులు చేపట్టగా 13 పెండింగ్​లో ఉన్నాయి. కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ బొటానికల్​ గార్డెన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్, గ్రేడ్ సెపరేట్లు, శిల్పా లే ఔట్​ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణం, కైత్లాపూర్ ఆర్ వోబీ,  నాగోల్​  ఫ్లై ఓవర్, ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్,  సంతోష్ నగర్​ ఎలివేటెడ్ కారిడార్, ఫలక్ నుమా  ఆర్ వోబీ, శాస్త్రిపురం ఆర్ వోబీలతో పాటు బైరామల్ గూడ వద్ద పనులు పెండింగ్​లో ఉన్నాయి. కొన్నిచోట్ల పనులు స్లోగా సాగుతున్నాయి. 

సెకండ్​ ఫేజ్..
ఫస్ట్ ఫేజ్​లో జరుగుతున్న వాటికి నిధులు ఇవ్వకుండా వీటిని పక్కన పెట్టి సెకండ్ ఫేజ్ ప్రారంభించేందుకు బల్దియా సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రపోజల్ కూడా పంపింది. అయితే ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తిచేయడంతో పాటు కొత్త వాటిని చేస్తే ఇబ్బంది లేదని జనం అంటున్నారు. అయితే ఇదే విషయంపై బల్దియా అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే  ఫస్ట్ ఫేజ్​లో కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు సెకండ్ ఫేజ్​ పనులు మొదలుపెడుతామని అంటు న్నారు. ఫస్ట్ ఫేజ్ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటితో పాటుగా కొనసాగుతాయని చెబుతున్నారు.