గురుకుల TGT పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో గందరగోళం

గురుకుల TGT పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో గందరగోళం

గురుకుల TGT పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో గందరగోళం నెలకొంది. గురుకుల బోర్డు అధికారులు 3 పేపర్లకు మూడు వేర్వేరు జిల్లాల్లో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దీంతో బోర్డు తీరుపై వేలాది మంది అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆగస్ట్ లో జరగబోయే గురుకుల TGT పరీక్షలకు జులై 27వ తేదీ గురువారం రాత్రి నుండి వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ ను అందుబాటులో ఉంచారు.

3 పేపర్ల  విధానంలో పరీక్ష ఉండగా వేలాది మంది అభ్యర్థులకు ఒక్కొ జిల్లాల్లో ఒక్కో ఎగ్జామ్ సెంటర్ ను కేటాయించారు గురుకుల బోర్డు అధికారులు. ఈ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరగనున్నాయి. ఒక అభ్యర్థికి కరీంనగర్ లో ఒక పేపర్.. పెద్దపల్లిలో మరో పేపర్.. హైదరాబాద్ లో ఇంకొక పేపర్.. ఎగ్జామ్ రాసేలా పరీక్ష కేంద్రాలను కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమందికి ఖమ్మంలో ఒకటి, హైదరాబాద్ లో రెండు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇంకొందరికి మాత్రం వరంగల్ లోనే వేర్వేరు చోట్ల 3 పరీక్ష కేంద్రాలు, కొందరికి హైదరాబాద్ లోనే 3 వేర్వేరు చోట్ల పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గురుకుల బోర్డు అధికారుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.