టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్తో విద్యాశాఖలో కోలాహలం

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్తో  విద్యాశాఖలో కోలాహలం
  • షెడ్యూల్ రాకతో టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో జోరు 
  • ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
  • బీఆర్ఎస్, ఇతర పార్టీల్లో అభ్యర్థిపై నో క్లారిటీ


హైదరాబాద్, వెలుగు:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో విద్యాశాఖలో కోలాహలం మొదలైంది. ఇప్పటికే బదిలీలు, ప్రమోషన్లు కొనసాగుతుండగా, తాజాగా ఎన్నికల హడావుడి తోడైంది. అయితే బీజేపీ అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎవరికైనా మద్దతు ప్రకటిస్తాయా లేదా అధికారికంగా అభ్యర్థులనే బరిలోకి దింపుతాయా అనేది త్వరలోనే తేలనుంది.

ఏ పార్టీ నుంచి ఎవరికి చాన్స్

మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవీకాలం 2023 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి13న పోలింగ్ జరనున్నది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకూ ఓటర్ నమోదు ప్రక్రియ జరగ్గా, 29 వేలకు పైగా అర్హులైన ఓటర్లు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఇంకొంత మంది వివరాలు ఓటర్ల జాబితాలో చేరే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఎన్నిక 9 జిల్లాల పరిధిలో ఉండటంతో, పొలిటికల్ పార్టీలూ దీన్ని కీలకంగా తీసుకున్నారు. ఇప్పటికే పలువురు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అధికారికంగా బీజేపీ మాత్రమే తమ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి పేరును ప్రకటించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డికి మద్దతిస్తుందా లేక, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డికి సపోర్ట్ చేస్తుందా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారికంగా బయటకు ప్రకటించకపోయినా, కిందిస్థాయిలో వెల్లడించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినయబాబుకు బీఎస్​పీ మద్దతిస్తోంది. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి సీపీఎం, ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావుకు సీపీఐ మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు హర్షవర్దన్ రెడ్డికి ఆ పార్టీ సపోర్టు చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సాయంత్రం పూట ప్రచారం

రాష్ట్రంలో టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలాఖరులో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. మార్చి 14 వరకూ కొనసాగనున్నది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. ఈ నెల 16న అధికారిక నోటిఫికేషన్ రానున్నది. అయితే ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియలో బీజీగా ఉన్నారు. ఇది ఎమ్మెల్సీ అభ్యర్థులకు కొంత ఇబ్బందికరంగా మారింది. డీఈవో ఆఫీసుల చుట్టూ టీచర్లు తిరుగుతుండటంతో, ప్రచారానికి ఆటంకం ఏర్పాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా సాయంత్రం పూట ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పోటీదారులు అన్ని స్కూళ్లు, కాలేజీల్లోని ఓటర్లను కలిసి వచ్చారు. తాజాగా మరోసారి కలిసేందుకు అన్ని సంఘాల నేతలు ప్లాన్ చేస్తున్నారు.

బరిలో మస్త్ మంది

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఇప్పటికే చాలామంది పోటీలో ఉంటామని ప్రకటించారు. పీఆర్టీయూ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి, పీఆర్టీయూటీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు, బీసీటీఏ తరఫున విజయ్ కుమార్, టీయూటీఎఫ్ నుంచి మల్లారెడ్డి, జీటీఏ అభ్యర్థిగా ప్రభాకర్, లోకల్ క్యాడర్ జీటీఏ తరఫున రవీందర్, టీఎస్టీసీఈఏ అభ్యర్థిగా సంతోష్ కుమార్, ఎస్సీఎస్టీయూఎస్ నుంచి లక్ష్మీనారాయణతో పాటు హర్షవర్ధన్ రెడ్డి సహా పలువురు పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ రావడంతో మరింత మందిపోటీలో ఉండే అవకాశముంది. అయితే ఎక్కువ మంది పోటీలో ఉండగా, ఇతర సంఘాల మద్దతు కూడగట్టేందుకు ప్రధాన అభ్యర్థులు మంతనాలు జరుపుతున్నారు.