
విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలపై జాప్యం జరగడం లేదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై జరుగుతున్న ఆలస్యంపై విలేకర్లు ప్రశ్నించగా లాలూ స్పందించారు. కూటమిలో చాలా పార్టీలున్నాయని అందువల్ల సీట్ల షేరింగ్ అంశం కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందిందా అని లాలూను విలేకర్లు అడిగారు. ఈ వేడుకకు తాను వెళ్లాలనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ గతంలో ఎల్ కే అద్వానీ రథ యాత్ర చేపట్టగా ఆయనను లాలూ అరెస్టు చేయించారు.