బీఆర్ఎస్​తో పొత్తు ప్రసక్తే లేదు : బండి సంజయ్

బీఆర్ఎస్​తో పొత్తు ప్రసక్తే లేదు :  బండి సంజయ్
  • ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలాడుతున్నరు: బండి సంజయ్
  • మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్లు ఎవరూ.. ఒక్క సీటు కూడా రాని 
  • ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేసీఆర్, కేటీఆర్​ను ఇప్పటికే జైల్లో వేసి.. ఆస్తులు జప్తు చేసేటోళ్లం
  • కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీశ్​ను కూడా పార్టీలో చేర్చుకుంటం
  • రాముడిని నమ్మినవాళ్లు బీజేపీకి ఓటేస్తరు.. నమ్మనివాళ్లు కాంగ్రెస్​కు వేస్తరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:బీఆర్ఎస్​ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే చాన్స్ లేని బీఆర్ఎస్ తో మెడ మీద తలకాయ ఉన్నోడెవ్వడూ పొత్తు పెట్టుకోరని ఆయన అన్నారు. ఒకవేళ పొత్తే జరిగితే బీజేపీలో సగంమంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనుకాడతారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 

‘‘బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నరు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నమని, ఎన్డీఏలో చేరబోతున్నమని ఆ పార్టీ నేతలకు అబద్ధాలు చెబుతూ.. వారు పార్టీని వీడకుండా డ్రామాలాడుతున్నడు. ఈ విషయంలో కేసీఆర్ ఎంతకైనా దిగజారుతడు. కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీని ఏన్డీఏలో చేర్చుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయే నావ” అని సంజయ్ అన్నారు. కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారని, ఈసారి వాళ్లంతా బీజేపీకి ఓటేయాలనే నిర్ణయానికి వచ్చారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో  సొంతంగానే బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పారు.

బీఆర్ఎస్ వాళ్లు ఒక్క బైక్​పై 126 గొర్రెలు తీసుకుపోయే ఘనులు

‘‘దేశంలో అత్యంత అవినీతిమయమైన పాలన కేసీఆర్ ది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలన్నింటిని కాగ్ ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఇది జరిగిందని కేంద్ర నివేదికలు వెల్లడించాయి. రాష్ట్ర విజిలెన్స్ కూడా ఇదే నివేదిక ఇచ్చింది. దీనికంతటికీ కారణమైన కేసీఆర్ ను, బాధ్యులైన ఇతరులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు” అని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మాట తప్పుతోందన్నారు. 

సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తేల్చిన తరువాత కూడా సీబీఐతో విచారణను ఎందుకు కోరడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు ఎంత ఘనులంటే.. ఒక్క బైక్ పై 126 గోర్రెలను తీసుకుపోయేటంతటి ఘనులని గొర్రెల స్కాంపై కాగ్ రిపోర్ట్​ను ప్రస్తావిస్తూ చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో స్మశానంలో బైక్ తో గడ్డి పీకినట్లుగా లెక్కలు చూపి రూ.12 లక్షలు దండుకున్నరని ఆరోపించారు. బైక్​తో ఎవరైనా గడ్డి పీకగలరా.. అది బీఆర్ఎస్ నేతలకే సాధ్యమన్నారు. 

కళ్లముందు ఇన్ని ఆధారాలున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్, అప్పటి మంత్రులు, బాధ్యులపైన ఎందుకు కేసులు పెట్టడం లేదని..  అరెస్ట్ ఎందుకు చేయడం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ను, కేటీఆర్​ను ఇప్పటికే జైల్లో వేసి, వాళ్ల ఆస్తులను జప్తు చేసే వాళ్లమన్నారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలన నచ్చకనే తెలంగాణ సమాజం కాంగ్రెస్ కు  అధికారం ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ కూడా ఇప్పుడు  అదే తరహా పాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. అందుకే అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో జెండా ఎగరేయబోతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  ఒక్క సీటు కూడా రాదని.. ఆ పార్టీది మూడో స్థానమే అని అన్నారు.

అవినీతిపరులను దగ్గరకు రానీయం

కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వాళ్లను బీజేపీలోకి ఆహ్వానిస్తామని సంజయ్ అన్నారు. వస్తానంటే మాజీ మంత్రి హరీశ్ రావులాంటి వాళ్లను సైతం స్వాగతిస్తామని చెప్పారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించే వాళ్లు, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వం పట్ల నమ్మకం ఉన్నోళ్లు ఎవరు వచ్చినా తమకు సంతోషమే అన్నారు. అవినీతిపరులను మాత్రం దగ్గరకు రానీయమని.. ఇది మోదీ విధానమని స్పష్టం చేశారు.

‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్ర మోదీ ఉన్నాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లు, ఎంఐఎం నేతలున్నరు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలో ప్రజలు తేల్చుకుంటరు. రాముడిని, దేవుడిని మొక్కేవాళ్లు బీజేపీకి ఓటేస్తరు. రాముడిని, దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్ కు  ఓటేస్తరు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ను దేశ ప్రజలంతా బహిష్కరించేందుకు సిద్ధమైన్రు” అని చెప్పారు.