1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకున్నది భారత కమ్యూనిస్టు పార్టీ. శతవసంతాల వేడుకలను లక్షలాదిమందితో కమ్యూనిస్టుల పురిటిగడ్డ అయిన ఖమ్మం పట్టణంలో ఈ నెల 18న జరపడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. భారతదేశ చరిత్రలో మహత్తర ఘట్టంగా నిలవబోతున్న ఈ భారీ బహిరంగ సభకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతున్నారు. 10 వేల మంది అరుణ సైన్యం కవాతు చేయబోతున్నది. ఎర్రసముద్రంగా మారబోతున్న ఖమ్మం బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరవుతున్నారు.
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సౌహార్ధ సందేశం ఇవ్వబోతున్నారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఉజ్వల వేడుకలలో 20వ తేదీన నిర్వహించే సెమినార్‌కు డి.రాజాతోపాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమత్రి భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. కంసుడు శ్రీకృష్ణుడిని పుట్టుకతోనే అంతం చేయ ప్రయత్నించినవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీని చెరసాలలోనే పసిగుడ్డు ప్రాయంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం అంతమొందించే ప్రయత్నం చేసింది. తుదకు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని మట్టికరిపించడంలో కమ్యూనిస్టు పార్టీ వీరోచిత పోరాటాలను, త్యాగాలను చేసింది.
సీపీఐ పుట్టుకే శ్రామిక అంతర్జాతీయత, దేశభక్తితో మిళితమై ఉంది. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో నాలుగు ప్రధాన స్రవంతులు కలిశాయి. ప్రపంచ యుద్ధ కాలంలో విదేశాల నుంచి ఆ తర్వాత జర్మనీ, అమెరికా, టర్కీ, ఆఫ్ఘనిస్థాన్‌లో విప్లవ కార్యాచరణలో ఉన్న భారత జాతీయ విప్లవకారులు అక్టోబర్ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. మహత్తర హిజ్రల్ ఉద్యమానికి సంబంధించిన జాతీయ విప్లవకారులు కూడా అక్టోబర్ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు ముఖ్యంగా పంజాబీలు 1913లో శాన్‌ఫ్రాన్సీస్‌కోలో ‘గదర్ పార్టీ’ని స్థాపించారు.
గదర్ పార్టీ ముఖ్యులందరూ భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. భారతదేశంలో ఉన్న జాతీయ విప్లవకారులు, జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగంగా పనిచేస్తున్న సోషలిస్టు కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది, అతివాదపక్షం, టెర్రరిస్టు సంస్థలు, ఖిలాపత్ ఉద్యమ నాయకులు, గదర్ పార్టీ నాయకులు 1921-–22లో శాసనోల్లంఘన ఉద్యమం విఫలమయిన తర్వాత గాంధీజీ సిద్దాంతం పట్ల భ్రమలు కోల్పోయిన వ్యక్తులు అక్టోబర్ విప్లవ ప్రభావంతో సోషలిజంవైపు ఆకర్షితులయ్యారు.
ఆ తర్వాత వీరే దేశంలో తొలి కమ్యూనిస్టు గ్రూపుల స్థాపకులయ్యారు. బొంబాయిలో డాంగే, మద్రాసులో సింగార్‌వేల్ సెట్టియార్, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, లాహోర్‌లో ఇంక్విలాబ్ గ్రూపులకు చెందిన వారి కలయికతో 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అయ్యింది. రైతాంగ పోరాటాలలో, విముక్తి పోరాటాల్లో, సంఘ సంస్కరణలు, సామాజిక మార్పులకోసం జరిగిన పోరాటాల్లో పాల్గొన్నవారిలో అధికులు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు.
ఎన్నో నిర్బంధాలు.. ఎన్నెన్నో కుట్ర కేసులు
పుట్టిన పసిగుడ్డును పొత్తిళ్లలోనే చంపే కుట్రలో కమ్యూనిస్టులపై ఎన్నో కేసులు పెట్టారు. 1922లో పెషావర్ కుట్ర కేసు. 1924లో కాన్పూర్ కుట్రకేసు, 1929లో కలకత్తాలో అఖిల భారత కార్మిక మహాసభ జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం 31మంది కమ్యూనిస్టు నాయకులకు, ఇతర పెద్ద నాయకులనందరిని అరెస్టు చేసింది. ఈ కేసు విచారణ 1929 నుంచి 1933 వరకు నాలుగేళ్లు కొనసాగింది.
లాహోర్ కుట్ర కేసు
సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్‌పై బ్రిటిష్ పోలీసులు విచ్చలవిడిగా లాఠీఛార్జి చేయడంతో ఆయన మరణించారు. దానికి కారకుడైన శాండర్స్‌ను 1928 డిసెంబర్ 17న భగత్‌సింగ్ చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురులు లాహోర్‌లో కాల్చి చంపారు. దీనికితోడు కేంద్ర శాసనసభలో 1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, డికే దత్తు బాంబులు వేశారు. రెండు సంవత్సరాలు జరిగిన కోర్టు విచారణ అనంతరం 1931 మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు. తదనంతరం భగత్‌సింగ్ సహచరులు అందరూ కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
కమ్యూనిస్టు పార్టీపై నిషేధం
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రమాదకరంగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వం 1934 జులైలో పార్టీని నిషేధించింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులందరూ కాంగ్రెస్‌లోనే ఉండి పనిచేసి దేశస్వాతంత్య్రం కోసం ద్విగుణీకృత పోరాటాలు నడిపారు. కాంగ్రెస్‌లోని అంతర్భాగంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని 1932-–34 ఏర్పాటు చేసుకున్నారు. అంతిమంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలోని కమ్యూనిస్టులతోపాటు మరెంతో మంది అభివృద్ది కాముకులు అక్టోబర్ విప్లవ ప్రభావంతో కాంగ్రెస్‌లోని వామపక్ష గ్రూపుగా ఏర్పడ్డారు. అనంతరం అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకులు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వీరిలో ఈఎంఎస్ నంబూద్రి
పాద్, చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఏకె.గోపాలన్, కంభంపాటి సీనియర్, రావి నారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డిలు ప్రముఖులు.
కమ్యూనిస్టు పార్టీ చేసిన వీరోచిత పోరాటాలు
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చాబర్ సిల్‌హెట్ జిల్లాలోని లోయ ప్రాంతంలో వీరోచిత కౌలు రైతుల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా వర్లీ తెగకు చెందిన ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1946లో రాయల్ ఇండియన్ నావీ తిరుగుబాటుదారులు కమ్యూనిస్టు పార్టీ జెండాను చేతబూనారు. పశ్చిమబెంగాల్‌లోని కౌలు రైతులు చేసిన పోరాటం ‘తెబాగా’ పోరాటం పేరుతో చరిత్ర ప్రసిద్ధమైంది.
కేరళలోని తిరువాన్‌కూర్ సంస్థానంలో కొబ్బరిపీచు కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకార్మికుల వీరోచిత పోరాటం మల్భార్ పోరాటంగా ప్రసిద్ధిగాంచింది. ఫ్రెంచ్ వలస పాలన నుంచి పుదుచ్చేరి విముక్తి పోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగి విజయవంతమైంది. చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ తదితరులు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో భగత్‌సింగ్ సహచరులైన అజెయ్ ఘోష్, శివవర్మ, పండిట్ కిషోరీలాల్, విజయ్‌కుమార్ సిన్హా, జయ్‌దేవ్ కపూర్, భగవతి చరణ్ ఛోప్రా, సుఖ్‌దేవ్ లాంటి వారు సీపీఐలో చేరారు. అజయ్ ఘోష్ 1962లో ఉమ్మడి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూనే మరణించారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
1946–-51 మధ్య జరిగిన ఈ పోరాటం చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన సాయుధ పోరాటం. మూడు వేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ, వెట్టి చాకిరి రద్దు లాంటి అనేక విజయాలు ఈ పోరాటంలో సాధించారు. ప్రధానంగా నిజాం నవాబు లొంగిపోవడం, హైద్రాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనం, సాయుధ పోరాట ప్రభావంతో జరిగాయి. విలీనం తర్వాత భారత సైన్యం, పోలీసులు కమ్యూనిస్టులపై దాడులకు పాల్పడటంతో జరిగిన రైతాంగ గెరిల్లా పోరాటంలో 4000మందికి పైగా కమ్యూనిస్టులు మృతిచెందారు.
10వేల మందిని డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి మూడు, నాలుగు సంవత్సరాలపాటు చిత్రహింసలకు గురిచేశారు. మహిళలతో నగ్నంగా బతుకమ్మలాడించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో (1946--–51) కృష్ణాజిల్లాలో 102 మంది, గుంటూరు జిల్లాలో 70 మంది, కడప జిల్లాలో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 27మంది, తెలంగాణ సాయుధ పోరాటానికి సహకారం అందిస్తున్న నేపథ్యంలో చంపివేశారు.
తెలుగు రాష్ట్రాలలో తృటిలో తప్పిన అధికారం
1952 ఫిబ్రవరిలో జరిగిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రాప్రాంతంలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, కాంగ్రెస్‌కు కేవలం 40 స్థానాలు మాత్రమే దక్కాయి. పార్టీపై నిషేధం అనంతరం కేవలం నెలాపది రోజుల్లోనే జరిగిన ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 61 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో కమ్యూనిస్టులు గెలిచారు. పార్టీబలపర్చిన 13మంది ప్రజాపార్టీ (ప్రకాశంపంతులు పార్టీ) అభ్యర్ధులు, 8 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. మెజార్టీ స్థానాలు గెలిచిన కమ్యూనిస్టులు ఇతర ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. అధికారం ఏర్పాటు చేసే అవకాశాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీల కుట్రలవల్ల కోల్పోవడం జరిగింది.
తెలంగాణ
స్వాతంత్య్రం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో (1952)లో కమ్యూనిస్టులు జనతంత్ర ప్రజాసంఘటన (పిడిఎఫ్) నాయకత్వంలో పోటీచేసిన 44 స్థానాలకుగాను 36 స్థానాల్లో గెలిచారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసిన కామ్రేడ్ రావినారాయణ రెడ్డికి అప్పటి భారత ప్రధానమంత్రి నెహ్రుకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అనేకమంది జైల్లో ఉండి గెలవడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో అభ్యర్ధులు దొరకనందున ఆ స్థానాల్లో కమ్యూనిస్టుల పేరుతో సోషలిస్టు పార్టీలు సీట్లు సంపాదించాయి. కొంతమంది ఇండిపెండెంట్లుగా గెలిచారు. ఆ విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అనగా మహారాష్ట్రలోని
5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలు, తెలంగాణలోని 8 జిల్లాలు కలిసి ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కమ్యూనిస్టు పార్టీ గెలవడం జరిగింది.
కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలు
1953–-56 మధ్య కాలంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకోసం జరిపిన పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రగామిపాత్ర పోషించింది. ఆంధ్రాలో విశాలాంధ్ర కోసం, కేరళలో ఐక్య కేరళ కోసం, తమిళనాడులో ఐక్య తమిళ కజగం కోసం, మహారాష్ట్రలో సమైక్య మహారాష్ట్ర కోసం ఉద్యమాలు నడిపి విజయవంతమైంది. భూ సంస్కరణలపై విజయం సాధించింది. కౌలుదారుల హక్కులు సాధించింది. కమ్యూనిస్టు పార్టీ మొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్యంకోసం పిలుపునిచ్చింది. 1921లో అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభలో తిరిగి 1922లో ‘గయ’లో ఈ గళాన్ని వినిపించారు.
కమ్యూనిస్టు నాయకులైన మౌలానా హస్రత్ మొహాని, స్వామి కుమారన్ ఈ నినాదాన్ని ఇచ్చారు. పాలక వర్గాలు సోషలిజం, సామాజిక న్యాయం అనే మాటలను వల్లించాల్సి వచ్చింది. కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమిందారీ, జాగిర్ధారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలను సమీకరించారు. భూ సమస్యను ఎజెండా మీదకు తెచ్చారు. మహిళా హక్కులు, కుల నిర్మూలన, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. రాత్రిబడుల ద్వారా అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించింది. యువతను విద్య, వైజ్ఞానిక సేవా సాంస్కృతిక కార్యక్రమాల్లో సమీకరించింది.
దేశంలో కమ్యూనిజం ఆవశ్యకత
దేశంలో కమ్యూనిజం ఆవశ్యకత, అవసరం ఎన్నడూలేని విధంగా ఈనాడు ఉన్నది. ఉద్యోగ భద్రత లేదు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలతో కొత్తరూపంలో శ్రమదోపిడీ జరుగుతున్నది. భావాన్ని, ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. కవులు, కళాకారులను మతోన్మాద ఆరాచకులు కాల్చి చంపుతున్నారు. సోషల్ మీడియాను ఒక యూనివర్సిటీగా మలచుకుని విద్రోహపూరిత విషజ్వాలలను సమాజంలో విరజిమ్ముతున్నారు.
ఆర్ధిక అసమానతలు ఎన్నడూలేని విధంగా పెరిగాయి. 4వ ఆర్థిక వ్యవస్థగా చెపుతున్నప్పటికి సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అలీన విధానాన్ని గాలికి వదిలేసి అమెరికా ఆదేశాలను పాటించే స్థితికి దేశపాలకులు వచ్చారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లిపోయినా భారతదేశ వ్యవస్థను బలంగా నిలపగలిగిన ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాలను సరళీకరణ పేరుతో విదేశీశక్తులకు, కార్పొరేట్ శక్తులకు స్వాధీన పరుస్తున్నారు.
బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, రైల్వే వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, అణుశక్తిలాంటి వ్యవస్థల్లో విదేశీయులను పెట్టుబడుల పేరుతో స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. ఈ దశలో దేశానికి కమ్యూనిజం అవసం ఏనాడు లేనివిధంగా ఉన్నది. ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థను కోరుకుంటున్నారు. హిడ్మా, నంబూరి కేశవరావు వంటివారిని ఎన్‌కౌంటర్ పేరుతో హతమారుస్తుంటే కోట్లాది గుండెలు తల్లడిల్లుతున్నాయి. చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, సురవరం సుధాకర్ రెడ్డి, ఏచూరి సీతారాం లాంటివారు మరణిస్తే కోట్లాది మంది నీరాజనాలు పలుకుతున్నారు.
ప్రపంచంలో బలమైన శక్తి కమ్యూనిజం
కమ్యూనిజం ఇంకెక్కడ ఉన్నది అనేవారికి జవాబు, ప్రపంచ జనాభా 600 కోట్లలో మూడో వంతు అనగా 187కోట్ల జనాభా కలిగిన దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అలాగే ప్రపంచంలోని 192 దేశాలలో దాదాపు 150 దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఆయా దేశాలకు దశా దిశా నిర్దేశం చేస్తున్నాయి. చైనా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్, కంబోడియా, శ్రీలంక, నేపాల్, లాటిన్ ఆమెరికా దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలలో వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. భారతదేశంలాంటి దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో లేకపోయినా కోట్లాదిమంది ప్రజాసంఘాలలో, కార్మిక సంఘాలలో సభ్యులుగా కొనసాగుతూ ప్రజా
సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు.
కమ్యూనిస్టుల ఐక్యత నేటి కర్తవ్యం
కమ్యూనిస్టు పార్టీ చీలికల వల్ల దేశంలో అణగారిన వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగింది. నక్సల్స్ పేరుతో, అర్బన్ నక్సల్స్ పేరుతో కమ్యూనిస్టులను, అభ్యుదయవాదులను అంతం చేస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థ మాత్రమే. మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్దాంతం, మనిషి ఉన్నంతకాలం, మనిషిలో ఆలోచనలు, భావాలు, ప్రశ్నలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది. సృష్టి ఉన్నంతకాలం కమ్యూనిజం కొనసాగుతుంది. ఈ దశలో కమ్యూనిస్టుల ఐక్యత అంతిమంగా కమ్యూనిస్టుల విలీనం దేశానికి, దేశ ప్రయోజనాలకు ఒక దిక్చూచి.
- కూనంనేని సాంబశివరావు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
