అనాథ శవాలు భద్రపరచడానికి ఇబ్బందులు

అనాథ శవాలు భద్రపరచడానికి ఇబ్బందులు
  • పట్టించుకోని వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు

మెట్ పల్లి, వెలుగు :  స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో డెడ్ బాడీలు భద్రపరచడానికి ఫ్రీజర్లు లేకపోవడంతో  మార్చురీల నిర్వహణ కష్టంగా మారింది. మార్చురీలో ఉన్న ఫ్రీజర్లు ఏడేళ్ల నుంచి పనిచేయకపోవడం, డెడ్ బాడీలను భద్రపరచడానికి సరైన వ్యవస్థ లేకపోయినా వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల మూడు జిల్లాలకు మెట్​పల్లి సెంటర్ పాయింట్ గా ఉండటంతో  ఇక్కడి సివిల్ హాస్పిటల్ కు ఏటా వందలాది పోస్టుమార్టం కేసులు వస్తుంటాయి. రోడ్డు యాక్సిడెంట్లు, సూసైడ్, అనాథ డెడ్ బాడీలను డివిజన్ కేంద్రమైన మెట్ పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలిస్తారు. పండుగలు, హాలిడేస్ సందర్భంగా డాక్టర్లు అందుబాటులో  ఉండకపోతే శవపంచనామా, పోస్టుమార్టం చేయడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో  డెడ్ బాడీలను భద్రపరచడానికి ఫీజర్లు లేకపోవడంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు 
వాపోతున్నారు.   

శిథిలావస్థకు చేరుకున్న పోస్టు మార్టం గది

 మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో  ఏడేళ్ల క్రితం రెండు ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు. కొన్ని నెలల తర్వాత అవి రిపేర్ కావడంతో అధికారులు మరమ్మతు చేయించలేదు. దీంతో పాడైన ఫ్రీజర్లు మూలన పడేశారు. దీంతో డెడ్ బాడీలను భద్రపరిచేందుకు బాధిత కుటుంబ సభ్యులు ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన ఫ్రీజర్లు తీసుకొస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ డెడ్ బాడీలు ఉంటే పోస్టు మార్టం రూంలోనే పెడుతున్నారు.  శిథిలావస్థకు చేరుకున్న పోస్టు మార్టంరూంలోనే  శవ పంచనామా చేస్తున్నారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. 

ఫ్రీజర్లు రిపేర్లు చేయిస్తాం

మెట్ పల్లి సివిల్ హాస్పిటల్ మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయని విషయం వాస్తవమే. డెడ్ బాడీలు భద్రపరచడానికి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ఫ్రీజర్లను తాత్కాలికంగా ఉపయోగిస్తున్నాం. మార్చురీ ఫ్రీజర్లను వెంటనే రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. బాధిత కుటుంబాలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- డాక్టర్. సాజిద్ అహ్మద్, సూపరింటెండెంట్, మెట్ పల్లి సివిల్ హాస్పిటల్