మణిపూర్​లో లా అండ్ ఆర్డరే లేదు: సుప్రీంకోర్టు

మణిపూర్​లో లా అండ్ ఆర్డరే లేదు: సుప్రీంకోర్టు
  • పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఫైర్
  • మూడు నెలలుగా డీజీపీ ఏం చేస్తున్నారు?
  • పూర్తి వివరాలతో  మా ముందు హాజరుకావాలి
  • కేసులు దర్యాప్తు చేసే సామర్థ్యం పోలీసులకు లేదు
  • మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటుపై ఆలోచిస్తామన్న ధర్మాసనం
  • డీజీపీ కోర్టుకు రావాలన్న సుప్రీం


న్యూఢిల్లీ: మణిపూర్​లో లా అండ్ ఆర్డరే లేదని, రాజ్యాంగ యంత్రాంగం మొత్తం కుప్పకూలిందని సుప్రీం కోర్టు మండిపడింది. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించింది. 3 నెలలుగా మణిపూర్​లో శాంతి భద్రతలు అనే మాటేలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జులై 25 నాటికి 6 వేల వరకు ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేసినట్లు తమకు సమర్పించిన నివేదికలో ఉందని, వాటిని దర్యాప్తు చేసే సామర్థ్యం కూడా మణిపూర్‌‌‌‌ పోలీసులకు లేదని విమర్శించింది. 3 నెలలుగా హింస జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈమేరకు డీజీపీకి సమన్లు జారీ చేసింది. 

‘‘మణిపూర్ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై 7వ తేదీన విచారణ జరుపుతాం. ఆ రోజు డీటెయిల్డ్​ రిపోర్ట్​తో డీజీపీ మా ముందు హాజరుకావాలి. ఎవరు బాధితుడు.. ఎవరు నేరస్తుడు అనే దాంతో మాకు సంబంధం లేదు. ఎవరు నేరం చేసినా.. కోర్టు తీరు ఇలాగే ఉంటది” అని సుప్రీం తేల్చి చెప్పింది. మణిపూర్ అల్లర్లపై వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌‌‌‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది 
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. జీరో ఎఫ్ఐఆర్, రెగ్యులర్ ఎఫ్ఐఆర్​లు రిజిస్టర్ అయిన తేదీలు.. సాక్షుల స్టేట్​మెంట్లు తీసుకున్న తేదీ.. సెక్షన్ 164 సీఆర్​పీసీ కింద వాంగ్మూలం ఎప్పుడు రికార్డ్ చేశారు.. అరెస్ట్ చేసిన తేదీ.. మొత్తం డీటెయిల్ స్టేట్​మెంట్ రెడీ చేయండి” అని ఆదేశించారు. 6 వేలకు పైగా ఎఫ్ఐఆర్​లు రిజిస్టర్ అయితే.. ఇప్పటి దాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో కూడా చెప్పాలని కోరారు.

పూర్తి వివరాలు సబ్మిట్ చేయాలి
మణిపూర్​లో మరో ఇద్దరు యువతులను గ్యాంగ్ రేప్ చేసి చంపిన ఘటనకు సంబంధించిన వివరాలు కూడా సబ్మిట్ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘అల్లర్లకు సంబంధించి 6,523 ఎఫ్ఐఆర్​లు రిజిస్టర్ అయ్యాయి. 11 ఎఫ్‌‌‌‌ఆఐర్‌‌‌‌లు మహిళలు, పిల్లలపై జరిగిన వేధింపుల ఘటనకు సంబంధించినవి ఉన్నాయి. మైనర్​తో సహా ఏడుగురిని అరెస్ట్ చేశాం” అని మెహతా తెలిపారు. 

సీబీఐతో దర్యాప్తు సాధ్యం కాదు
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. మే 4న ఘటన జరిగితే జులై 26న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు నివేదికలో ఉందన్నారు. చాలా కేసుల్లో అరెస్ట్​లు, స్టేట్​మెంట్​ రికార్డులే జరగలేవని తెలిపారు. ఒకే రోజు రాత్రి 6వేల ఎఫ్ఐఆర్​లు వేశారని, దీంతో డేటాలో కొన్ని లోపాలు ఉండొచ్చని మెహతా బదులిచ్చారు. 6 వేల ఎఫ్ఐఆర్​లు దర్యాప్తు చేయడం సీబీఐతో సాధ్యం కాదని, మాజీ జడ్జీలతో కమిటీ వేస్తామని చెబుతూ విచారణను  సీజేఐ 7వ తేదీకి వాయిదా వేశారు. 

మహిళల స్టేట్​మెంట్ రికార్డింగ్ ఆపండి
మణిపూర్​లో నగ్నంగా ఊరేగింపు చేస్తున్నప్పుడు వీడియోలో కనిపిస్తున్న మహిళల స్టేట్​మెంట్లు రికార్డ్ చేయడం ఆపేయాలని సీబీఐ అధికారులను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుపుతున్నామని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల బెంచ్​ తెలిపింది. మహిళల తరఫు వాదనలు వినిపిస్తున్న లాయర్ నిజాం పాషా నోట్ మేరకు స్టేట్​మెంట్ ఆపేయాలని బెంచ్ ప్రకటించింది.