గడీల పాలనను యాదికి తెస్తున్న ప్రభుత్వ భవనాలు

గడీల పాలనను యాదికి తెస్తున్న ప్రభుత్వ భవనాలు
  • అడుగడుగునా కంచెలు, పోలీసు బలగాలు
  • ప్రగతిభవన్ నుంచి సెక్రటేరియెట్​ దాకా ఇదే తరీఖా
  • ఒకప్పటి గడీల లెక్క సర్కారు వారి కొత్త సౌధాలు
  • వినతిపత్రం ఇద్దామని ప్రతిపక్షాలు వెళ్తే అరెస్టులు
  • పర్మిషన్​ లేదంటూ కిలోమీటర్ల దూరంలోనే అడ్డగింతలు
  • గోస చెప్పుకుందామని జనం వస్తే.. గడప తొక్కనిస్తలే
  • ఢిల్లీలోని బీఆర్ఎస్ ​ఆఫీస్​లోకి కూడా
  • మీడియాకు నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: ప్రజాధనంతో కట్టిన ప్రభుత్వ భవనాలు.. గడీల పాలనను యాదికి తెస్తున్నాయి​. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో వేల కోట్లతో నిర్మించిన కొత్త సెక్రటేరియెట్, ప్రగతి భవన్​తో పాటు అధికార పార్టీ హైదరాబాద్​ హెడ్​ ఆఫీసు, ఢిల్లీలో కట్టుకున్న ఆఫీస్​.. ఇట్లా ఏ బిల్డింగ్​లోకి కూడా జనాన్ని అడుగుపెట్టనిస్తలే. ఆవైపు కన్నెత్తి చూడనిస్తలే. అడుగడుగునా బారికేడ్లు, ఇనుపకంచెలు.. పోలీసు బలగాలు.. మందిమాగధుల మోహరింత.. గతకాలపు గడీల చరిత్రను తలపిస్తున్నది. మీడియా సంస్థలపై నిషేధాజ్ఞలు.. గోడు చెప్పుకుందామని జనం వస్తే అడ్డగింతలు.. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్షాలు వెళ్తే  అరెస్టులు కొనసాగుతున్నాయి.
అత్యంత విలాసవంతంగా.. అత్యంత ఖరీదుతో రూపుదిద్దుకున్న ఈ భవనాలను పాలకులు తమ ఘనకీర్తిగా ప్రచారం చేసుకోవడానికే ఉపయోగించుకుంటున్నారు.  

సెక్రటేరియెట్​.. అదో కోట

గట్టిగా ఉన్న సెక్రటేరియెట్​ బిల్డింగ్​ను కూల్చేసి.. తెలంగాణ చరిత్ర అంటేనే తాను అని చెప్పుకోవాలనే ఆలోచనతో  కొత్త బిల్డింగ్​ను కేసీఆర్​ కట్టించారు.  రూ.400 కోట్లతో మొదలు పెట్టిన ఈ భవన నిర్మాణ ఖర్చు నాలుగు రెట్లు పెరిగింది. రూ.1,600 కోట్ల దాకా ఖర్చయింది. ఇంత పెద్ద మొత్తంలో జనం సొమ్ముతో కట్టిన కొత్త సెక్రటేరియెట్లోపలికి జనాన్ని రానివ్వడం లేదు. తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్తే అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాత సెక్రటేరియెట్ కూల్చివేత నుంచే  ఇక్కడ మీడియాపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఓపెనింగ్​ రోజైతే తాము మెచ్చిన, నచ్చిన మీడియా సంస్థలను మాత్రమే లోపలికి అనుమతించి.. మిగతా మీడియాను రోడ్డుపైనే ఆపేశారు. ప్రతిపక్ష నేతలనైతే గేటు కూడా తొక్కనిస్తలేరు. అదేదో బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​అన్నట్టుగా ఆ పార్టీ నేతలకు మాత్రమే రెడ్ ​కార్పెట్​వెల్​కమ్​ చెప్తున్నారు. మూడు రోజుల కింద ఓఆర్​ఆర్​ టోల్​ టెండర్లపై ఎంఏయూడీ స్పెషల్​ సీఎస్​ అర్వింద్​కుమార్​ను సెక్రటేరియెట్​లో కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన ఎంపీ​ రేవంత్​రెడ్డిని కిలో మీటర్​ దూరంలోనే  పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు. తాను ఎంపీని అని, అధికారులను కలిసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుమతి తీసుకోవాల్నా అని ప్రశ్నించినా పోలీసులు వినిపించుకోలేదు. వెనక్కి పంపించేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు గురువారం సెక్రటేరియట్​కు బయల్దేరిన టీజేఎస్​ చీఫ్ ​కోదండరాం, మాజీ​ ఐఏఎస్​అధికారి ఆకునూరి మురళిని పోలీసులు అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. సెక్రటేరియెట్​ ప్రారంభించి ఐదు రోజులవుతున్నా.. ఒక్క ప్రతిపక్ష, ప్రజాసంఘాల నాయకుడిని కూడా లోపలికి అనుమతించలేదు. సెక్రటేరియెట్​కు బయల్దేరిన వారిని మధ్యలోని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. సెక్రటేరియెట్​కు 60‌‌0 మందికి పైగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు.  తమ సమస్యలు చెప్పుకునేందుకు జనం వెళ్తే రానీయడం లేదు.  

ప్రగతి భవన్​.. అదో రాజమందిరం

ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే బేగంపేటలో క్యాంపు ఆఫీస్​కట్టారు. వాస్తు పేరుతో దాని ముఖం చూడని కేసీఆర్..  రూ. 49.84 కోట్లతో ప్రగతి భవన్​ను కట్టించారు. ఆయన ఉండేది ప్రగతి భవన్​లోనే . ప్రజల సొమ్ముతో కట్టించిన ప్రగతి భవన్​ లోపలికి ప్రజలకు మాత్రం ఎంట్రీ లేదు. తమ సమస్యలను సీఎంకు చెప్పుకుందామని అటువైపు ఎవరైనా వస్తే పోలీసులు అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్లకు తరలించడం పరిపాటిగా మారింది. ప్రగతి భవన్​ వైపు ఎవరూ వెళ్లకుండా కిలో మీటర్ల దూరం వరకు భారీ ముళ్లకంచెలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్​కు వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  317 జీవోకు వ్యతిరేకంగా ప్రగతి భవన్​ను ముట్టడించిన టీచర్ల విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం క్యాంపు ఆఫీసులోకి ఉదయం పూట జనం వెళ్లి.. తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకునేవాళ్లు. ఈ పద్ధతిని చాలా మంది సీఎంలు కొనసాగించారు. కానీ, తెలంగాణ వచ్చాక, సీఎం క్యాంపు ఆఫీసు స్థానంలో ప్రగతిభవన్​ కట్టాక మాత్రం జనాన్ని అటువైపు అడుగుపెట్టనివ్వడంలేదు. 

ఆగమేఘాల మీద ప్రగతిభవన్​ కంప్లీట్​.. తొమ్మిదేండ్లయినా పేదలకు ఇండ్లేవి?

బేగంపేట సీఎం క్యాంపు ఆఫీస్​లో కాలు పెట్టేందుకు ససేమిరా అన్న కేసీఆర్..​అధికారుల వెంటపడి ఆరు నెలల్లోనే ప్రగతి భవన్ ​నిర్మాణం పూర్తి చేయించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సెక్రటేరియెట్​ నిర్మాణ పనులు ఆగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను అనుకున్న గడువులోపే సెక్రటేరియెట్​కంప్లీట్ చేసి పార్టీ వేడుకలా ప్రారంభోత్సవం చేశారు. గూడులేని నిరుపేదలు, పేదలకు ఇవ్వాల్సిన డబుల్​బెడ్రూం ఇండ్ల నిర్మాణం మాత్రం తొమ్మిదేండ్లుగా సాగుతున్నది. కొన్ని కంప్లీట్ ​చేసినా ప్రజలకు పంపిణీ చేయడం లేదు. 

పార్టీ ఆఫీసులు.. సొంత ఆస్తుల్లా?

బీఆర్ఎస్​ వ్యవహారాలన్నీ ప్రజలిచ్చిన విరాళాలతోనే చేపడుతున్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న హైదరాబాద్​లోని పార్టీ హెడ్​ ఆఫీస్​, జిల్లాల్లోని ఆఫీసులు, ఢిల్లీలో కొత్తగా కట్టిన ఆఫీసులోకి ప్రజలను రానివ్వడం లేదు. పార్టీ ఆఫీసుల స్థలాల కొనుగోలుకు, భవనాల నిర్మాణానికి, పార్టీ రోజువారీ కార్యకలాపాలకు చేసే ఖర్చు మొత్తం విరాళాల సొమ్మే. రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించే అవకాశం రాజ్యాంగమే కల్పించింది. ఆ ప్రొవిజన్​ను నూటికి నూరుపాళ్లు వినియోగించుకుంటున్న బీఆర్ఎస్.. అదే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలను కవర్​ చేయడం మీడియా సంస్థల బాధ్యత. ఢిల్లీలో గురువారం బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్ ​ప్రారంభోత్సవానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను అవమానకరంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు.  

మొక్కుడే.. మొక్కుడు!

ఈ మధ్య ఏ కార్యక్రమం జరిగినా  కేసీఆర్ కాళ్ల మీదపడటం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లీడర్లకు అలవాటుగా మారింది. ఏప్రిల్​ 30న సెక్రటేరియెట్​ ప్రారంభోత్సవం సందర్భంగా, గురువారం ఢిల్లీలో బీఆర్​ఎస్​ ఆఫీసు ఓపెనింగ్​ సందర్భంగా కేసీఆర్​కు పాదాభివందనం చేసేందుకు పోటీ పడ్డారు. గతంలో కొందరు కలెక్టర్లు, అధికారులు కూడా బహిరంగంగానే కేసీఆర్​కాళ్లు మొక్కారు. కేసీఆర్ కాళ్లు మొక్కిన కొందరు అధికారులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 

రాజుల కోటలా సెక్రటేరియెట్ 

ఇవ్వాళ రాష్ట్రంలో రాచరిక పాలన కనిపిస్తున్నది. వెనకటికి రాజు దర్పం ప్రదర్శించేందుకు కోటలు నిర్మించుకున్నట్లుగా సీఎం కేసీఆర్ సెక్రటేరియెట్  నిర్మించిండు. రాజదర్బార్ లోకి ఆస్థాన ఉద్యోగులకు, మంత్రులకు తప్ప వేరే వాళ్లకు ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కేసీఆర్ అనుసరిస్తుండు. సెక్రటేరియెట్ ను కూల్చి బీఆర్కే భవన్ కు తరలించినప్పటి నుంచే  జర్నలిస్టులను అక్కడికి అనుమతిస్తలేరు. సమస్యలు చెప్పుకుందామని ప్రభుత్వం దగ్గరికి పోవడానికి జనానికి రాష్ట్రంలో తొవ్వలేదు. సాలెగూడులో చిక్కుకున్నట్లు ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా వాళ్ల చేతిలో నిర్ణయాధికారం లేదు కాబట్టి చేతులెత్తేస్తున్నరు. 
‑ ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ చీఫ్​

ఎంపీలకూ పర్మిషన్ కావాల్నా

సెక్రటేరియెట్​లోకి వెళ్లాలంటే ఎంపీల కూ పర్మిషన్​ కావాల్నా..? అట్లయితే బీఆర్ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలను లోపలికి ఎందుకు అనుమతిస్తున్నరు? ఎంపీగా నేను సెక్రటేరియెట్​కు వెళ్తానంటే సీఎంకు అభ్యంతరమేంది? కనీసం సెక్రటేరియెట్​ గేటు వద్దకు కూడా పోనివ్వరా..? అధికార పార్టీ లీడర్లను ఏ హోదాలో సెక్రటేరియెట్​లోకి అనుమతిస్తున్నరు.. ప్రజల కోసమే కదా ప్రతిపక్షాలు పనిచేసేది.. వాళ్ల సమస్యలు చెప్పుకోలేని సెక్రటేరియెట్​ఎందుకు?
‑ రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్​

కేసీఆర్​ జాగీరా?

సెక్రటేరియెట్, ప్రగతి భవన్​ప్రజల సొమ్ముతో నిర్మించినవే.. ప్రజలకు సేవలందించేందుకు కట్టినవే. అవ్వేమీ కేసీఆర్​ సొంత జాగీర్​కాదు.. సెక్రటేరియెట్​లోకి ప్రజలను ఎందుకు రానివ్వరు.. మీడియాను ఎందుకు రానిస్తలే? ఫామ్​హౌస్​లో ఉండి పాలించే కేసీఆర్ ​వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెక్రటేరియెట్​కట్టినా ప్రజలను రానియ్యకుంటే అది ఎవరికి ఉపయోగం..? కేసీఆర్​కు  అక్కరకు వచ్చే వాటిని వేగంగా పూర్తి చేసి, ప్రజలకు ఇచ్చే డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు మాత్రం కడుతలేరు.
‑ బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఎవడబ్బ సొమ్మని రానివ్వరు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రభుత్వ భవనం.. దీంట్లోకి ప్రజలను, ప్రతిపక్షాలను అనుమతించకపోవడం సరికాదు. అది పబ్లిక్ హౌస్​.. ప్రైవేటు హౌస్ కాదు. ప్రజాస్వామ్య విలువలను సీఎం కేసీఆర్ కాపాడాలి. సెక్రటేరియెట్, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రతిపక్ష పార్టీలను పిలువాల్సింది.  అంశాలతో విభేదాలుంటే.. ప్రతిపక్షాలను లోపలికి రానివ్వరా? ప్రజాప్రతినిధులను రానివ్వకపోతే ఎలా.. ప్రజాధనంతో కట్టిన సచివాలయంలోకి ఎందుకు రానివ్వరు.. ఎవడబ్బ సొమ్మని రానివ్వరు?
‑ కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి