- రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉంది: సీఎస్
- డ్రింకింగ్ వాటర్ సప్లైపై అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రం లో తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామన్నారు. ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశా రు. మంచినీటి సరఫరా విషయంలో ఏవిధమైన ఆందోళనలు అవసరం లేదని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి లభ్యత, వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు తీసుకున్నచర్యలపై సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షించారు.
పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
10వ తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సీఎస్ తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ రవి గుప్తా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ, టెన్త్ పరీక్షలు మొదలై రెండు రోజులు అయ్యాయని, మిగిలిన పరీక్షలను కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం పట్ల కలెక్టర్లను, అధికారులను సీఎస్ అభినందించారు.
