కోల్బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి కుటుంబానికి వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఆ కుటుంబంపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని క్యాతనపల్లి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వోడ్నాల శ్రీనివాస్ అన్నారు.
శనివారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ ఆఫీస్లో మీడియా సమావేశంలో పాల్గొని కాకా వెంకటస్వామి కుటుంబం, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ లీడర్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్మాట్లాడుతూ ఇటీవల ఎంపీ వంశీకృష్ణ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ యువత కోసం కనీసం 50 ఉద్యోగాలు కల్పించాలని కోరారని, ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి వ్యంగ్యం లేదని స్పష్టం చేశారు. అది రాష్ట్ర నిరుద్యోగ యువత తరఫున అడిగిన న్యాయమైన ప్రశ్న మాత్రమేనని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వరుసగా జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, గ్రూప్-1 పరీక్షల రద్దు, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదాలు, వేలాది మంది నిరుద్యోగ యువతను తీవ్ర ఆందోళనకు గురిచేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్నారని, రెండేండ్లలోనే రూ.8 వేల కోట్ల నిధులు తీసుకవచ్చారని గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు గోపు రాజం, సత్యనారాయణ, కార్యదర్శులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
