ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు : కిషన్ రెడ్డి

ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు : కిషన్ రెడ్డి

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు డబుల్ అయ్యాయని, ఇది తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మరో బహుమతి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వేల విషయంలోనూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఆయన.. సుమారు రూ. 650 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ఆధునీకకరించబోతున్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభం కాబోతుందన్నారు. కనీస మర్యాద లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏ రకంగా ఉందో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే.. సిద్ధాంతాలు, రాజకీయ విబేధాలు పక్కన పెట్టి స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కుటుంబ పాలనకే అంకితమైంది

ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి... సీపీఎం, డీఎంకే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులైనా ఏ రాష్ట్రంలోనూ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి లేదని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్ని రోజులు అధికారంలో ఉంటే రాష్ట్రానికి అంతకాలం నష్టం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తోందన్న ఆయన... గవర్నర్ వస్తే.. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదన్నారు. ఒక మహిళ అని చూడకుండా గవర్నర్ ను, రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, రైతు సంఘాలను అవమానిస్తున్నరని ఆరోపించారు. తెలంగాణలో పూర్తిగా నియంతృత్వ ప్రభుత్వం ఉందని, తెలంగాణకు ద్రోహం చేసే ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా కుటుంబ పాలనకే అంకితమైందన్న కిషన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు తెలంగాణ అభివృద్ధి వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోడీ వస్తే కనీస మర్యాద లేదు..

ఎంతసేపూ నిజాం రాజ్యాంగం ఉండాలి.. నా తర్వాత నా కుటుంబమే ఈ రాష్ట్రాన్ని ఏలాలని తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తే కనీస మర్యాద లేదని ఆరోపించారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు.. మీకు మీ పదవి తప్ప, రాజకీయాలు తప్ప తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా.. అని ప్రశ్నించారు. ఇప్పుడే కాదు మళ్లీ మళ్లీ ప్రధాని తెలంగాణకు వస్తారని, ఒక్క కేసీఆర్ కాదు.. వేల మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోడీ రాకను అడ్డుకోలేరని చెప్పారు. తెలంగాణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోడీ వస్తూనే ఉంటారని చెప్పారు. 

టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి భయపడం

మోడీ ప్రభుత్వం కచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న కిషన్ రెడ్డి... మీరు చెప్పినంత మాత్రాన, పిలుపునిచ్చినంత మాత్రానా, మీ కిరాయి మనుషులతో, మీరు బ్యానర్లు కట్టినంత మాత్రానా మోడీని అడ్డుకోలేరన్నారు. తాము పోరాటాలు చేసి, జైలుకెళ్లి ఈ రోజు అధికారంలో ఉన్నామని చెప్పారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లం కాదన్న ఆయన... 2018లో కొమరం భీమ్ రామ్ జీ మ్యూజియం ఇస్తే.. ఇంత వరకూ కేసీఆర్ భూమి ఇవ్వలేదు గానీ.. మీరు ప్రధాని మోడీని విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ ఇచ్చినా కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు. తాము టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి భయపడమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం, ఆకాంక్ష కోసం పని చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోడీ గారు.. మీరు మళ్లీ మళ్లీ రావాలన్న ఆయన... ఈ ప్రభుత్వాన్ని, అవినీతిరహిత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకు బీజేపీ పోరాటం కొనిసాగిస్తుందని తేల్చి చెప్పారు.