టీఆర్ఎస్ కు హుజూరాబాద్ టెన్షన్

టీఆర్ఎస్ కు హుజూరాబాద్ టెన్షన్
  • క్యాండిడేట్​పై సర్వేల మీద సర్వేలు​ 
  • నియోజకవర్గంలో తిరుగుతున్న ఇంటెలిజెన్స్​వర్గాలు
  • జర్నలిస్టుల పేరిట రంగంలోకి దిగిన థర్డ్​పార్టీ
  • ఈటలకు దీటుగా ఎవరినీ గుర్తించని జనాలు

కరీంనగర్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్​రాజీనామాతో హుజూరాబాద్​అసెంబ్లీ స్థానానికి జరిగే బై ఎలక్షన్లలో ఎవరిని పోటీకి దింపాలన్నది రూలింగ్​పార్టీకి సవాల్​గా మారింది. ఈటలకు దీటైన క్యాండిడేట్​ఎవరూ కనిపించకపోవడంతో ఓ రకంగా టీఆర్ఎస్​లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎవరైతే గట్టిపోటీ ఇవ్వగలరన్నది అంచనా వేసేందుకు రకరకాల సర్వేలు చేయిస్తోంది.  ఓవైపు థర్డ్ పార్టీ సర్వే చేయిస్తున్న అధికార పార్టీ.. ఇంటెలిజెన్స్, మెప్మా తదితర ప్రభుత్వ విభాగాలను కూడా ఇందుకు వాడుకుంటోంది. 

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల ఎదురులేని నేతగా అవతరించారు. ఆయనకు పోటీనిచ్చే స్థాయి లీడర్ టీఆర్ఎస్​లో ఎవరూ లేరు. ఇతర పార్టీల్లోనూ అలాంటి నాయకుడు కనిపించట్లేదు. టీఆర్ఎస్​కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని కోణాల్లో పరిశీలించి క్యాండిడేట్​ను ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే చాలా పేర్లను పరిశీలించినా.. వారెవరూ గట్టి పోటీనిచ్చే అవకాశం లేదన్న నిర్ధారణకు కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అసలు నియోజకవర్గ ప్రజల మూడ్ ఎలా ఉంది, ఈటల పట్ల జనాల్లో ఏ మేరకు సానుకూలత  ఉంది, సామాజిక సమీకరణాల ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలను తెలుసుకునేందుకు ప్రతి మండలంలో రోజూ 20 మంది ఇంటెలిజెన్స్​పోలీసుల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇంటెలిజెన్స్​వాళ్లను పిలిపించారని తెలిసింది.  ఇప్పటికే టీఆర్ఎస్ పరిశీలనలో ఉన్న పేర్లను ప్రస్తావిస్తూ వాళ్లపై జనాలకు ఎలాంటి అభిప్రాయముందో తెలుసుకుని ఏరోజుకారోజు రిపోర్ట్​ చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా ఇన్​డైరెక్ట్​గా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీజేపీ ప్రభావం, సానుభూతి తదితర అంశాలు ఏమేరకు  ఈటలకు కలిసి వస్తాయి, ఆయనకు ఎవరైతే పోటీనివ్వగలరు, కుల సమీకరణాలు ఏమన్నా పనిచేస్తాయా అన్న అంశాల మీద కూడా థర్డ్​పార్టీ సర్వే చేయిస్తున్నారు. జర్నలిస్టుల పేరిట ఈ ఏజెన్సీల ప్రతినిధులు అన్ని మండలాల్లో తిరుగుతున్నారు. జనాలు గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో డిస్కషన్​ చేస్తూ ఓటర్ల మూడ్ అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో వీరు విస్తృతంగా సర్వే చేసినట్టు అక్కడి ప్రజలు చెప్తున్నారు.  

కొత్త వారి కోసం అన్వేషణ

ఇప్పటివరకు సీఎం కేసీఆర్​ దృష్టికి చాలాపేర్లు వచ్చాయని, అయితే ఇందులో ఎవరి మీద ఆయన ఇంట్రెస్ట్​ చూపడం లేదని తెలుస్తోంది. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్​రెడ్డి ఫ్యామిలీకి చెందిన ముద్దసాని పురుషోత్తంరెడ్డి,  టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, పద్మశాలి నేత వీరేశం, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ ప్రశాంత్ రెడ్డి తదితరుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇటీవల టీఆర్ఎస్​లో చేరిన టీడీపీ మాజీ ప్రెసిడెంట్ ఎల్.రమణను పోటీకి దింపాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని చెప్తున్నారు. ఆడియో లీక్​ద్వారా కాంగ్రెస్​లో కలకలం రేపిన పాడి కౌశిక్​రెడ్డి టీఆర్ఎస్​లో చేరనున్నారని, ఆయనకే అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ​ వీరి మీద జనాల రియాక్షన్ ఎలా ఉందో సర్వేలో తెలుసుకుంటున్నారు. దాదాపు అందరి మీద జనాల ఫీడ్​బ్యాక్​ఏమంత సానుకూలంగా లేకపోవడంతో కొత్తవారి కోసం కేసీఆర్​అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. 

అయోమయంలోటీఆర్ఎస్​ కేడర్  

ఓ వైపు ఈటల ప్రచారంలో స్పీడ్​ పెంచారు. ఆయన సతీమణి జమున ఊర్లన్నీ చుట్టి వస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రావచ్చని తెలుస్తోంది. ఈ స్థితిలో రూలింగ్​పార్టీ ఇంకా క్యాండిడేట్ ఎవరన్నది తేల్చుకోలేకపోవడం.. నేతలు, కేడర్​ను టెన్షన్​కు గురిచేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్​లో తిరుగుతున్నారు..  కానీ క్యాండిడేట్ లేకపోవడంతో ప్రచారంలో జోష్​ కనిపించట్లేదు. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది ఈటల వెంట వెళ్తున్నారు. ఇప్పటికైనా క్యాండిడేట్​ ఎవరో తేల్చకుంటే ఈ వలసలు మరెంత దూరం వెళ్తాయో చెప్పలేని పరిస్థితి ఉందని టీఆర్ఎస్​ నేతలు ఆందోళన చెందుతున్నారు.