
న్యూఢిల్లీ: లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని అహింసా మార్గంలోనే కొనసాగించాలని అక్కడి ప్రజలకు యాక్టివిస్టు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ప్రజలంతా శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర హోదా పోరాటంలో భాగంగా అరెస్టయిన వాంగ్‌చుక్.. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నారు.
ఆయనను తన అన్న, లాయర్ కలిశారు. ఈ సందర్భంగా లడఖ్ ప్రజలకు వాంగ్‌చుక్ సందేశం పంపించారు. ‘‘నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగానే ఉన్నాను. నా గురించి ఆలోచిస్తున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాష్ట్ర హోదా పోరాటంలో ప్రాణాలు కోల్పోయినోళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఘర్షణల్లో జరిగిన నలుగురి హత్యలపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. లేదంటే నేను జైల్లోనే ఉంటా” అని తెలిపారు.
‘‘లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (కేడీఏ), ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు నేను మద్దతు ఇస్తున్నాను. ఈ విషయంలో అపెక్స్ బాడీ తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తాను. ప్రజలంతా గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో పోరాడాలి. శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.